Published : 24 Dec 2021 01:16 IST

Omicron scare: ఒమిక్రాన్‌తో దేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా?

ఇంటర్నెట్ డెస్క్:  ప్రపంచ దేశాలను శరవేగంగా చుట్టేస్తోన్న ‘ఒమిక్రాన్‌’ మన దేశంలోనూ కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ కేసులతో పాటు కొవిడ్‌ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షల్ని తెరపైకి తీసుకొచ్చాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా రాత్రిపూట కర్ఫ్యూలు వంటివి అమలుచేయాలంటూ మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణలో కూడా ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్న వేళ ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఇలా..

మధ్యప్రదేశ్‌లో నేటి నుంచే నైట్‌ కర్ఫ్యూ.. సీఎం వెల్లడి

ఒమిక్రాన్‌ భయాందోళనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాక రోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో ఒక్క ఒమిక్రాన్‌ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

దిల్లీలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధాజ్ఞలు

దిల్లీలో కొవిడ్‌-19 కేసుల పెరుగుదలతో పాటు, ‘ఒమిక్రాన్‌’ సోకిన వారి సంఖ్య పెరగడంతో కేజ్రీవాల్‌ సర్కార్‌ అప్రమత్తమైంది. క్రిస్మస్‌, నూతన సంవత్సర సంబరాలపై నిషేధం విధిస్తూ నిన్న నిర్ణయం ప్రకటించింది. ఈ వేడుకలను సామూహికంగా జరుపుకోకూడదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిని అనుమతించొద్దని వాణిజ్య సంఘాలను ఆదేశించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఆదేశాల్లో పేర్కొంది. కొవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలుచేస్తేనే పాఠశాలలు, కళాశాలలు నిర్వహించేందుకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. బార్‌లు రెస్టారెంట్లలో 50శాతం సిటింగ్‌ సామర్థ్యంతో అనుమతించనున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు మాత్రం 200 మంది మించరాదని ఆంక్షలు విధించారు. 

ముంబయిలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్‌

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆరడుగుల భౌతికదూరం పాటించాలని స్పష్టంచేసింది. ఏవైనా వేడుకలు, సమావేశాలను 50శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించుకోవాలని, కొవిడ్‌ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. 200 కన్నా ఎక్కువ మందితో కార్యక్రమాలు నిర్వహించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరని తెలిపింది. మరోవైపు, ఇప్పటికే డిసెంబర్‌ 16 నుంచి 31వరకు ముంబయిలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్‌ పూర్తయినవారినే ప్రజా రవాణా సంస్థలు ప్రయాణానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. 

గుజరాత్‌.. 9నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ

ఒమిక్రాన్‌ వ్యాప్తి, రాబోయే పండగ సీజన్‌లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, సూరత్‌, రాజ్‌కోట్‌, వడోదర, భవ్‌నగర్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలుకానుంది. ఆయా నగరాల్లో అర్ధరాత్రి దాకా 75శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పనిచేసేందుకు అనుమతి కల్పించారు.

కర్ణాటకలో బహిరంగ ప్రదేశాల్లో సామూహక వేడుకలు నిషిద్ధం

నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహక కార్యక్రమాలు చేపట్టరాదని, సామూహిక వేడుకలకు అనుమతిలేదని తెలిపింది. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగంపై నిషేధం విధించింది. కొవిడ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై నిపుణులతో ఇటీవల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. వారి సిఫార్సుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘డిసెంబరు 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నాం. పబ్‌లు  50శాతం సామర్థ్యంతో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించుకోవచ్చు. అయితే అక్కడ డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదు. ఇక రెండు డోసుల టీకా తీసుకోనివారిని పబ్‌లు, రెస్టారెంట్లలోకి అనుమతించొద్దు. అలాగే, అపార్ట్‌మెంట్లలోనూ డీజేలను నిషేధిస్తున్నాం’ అన్నారు. 

జీతం కావాలంటే పంజాబ్‌లో వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిందే!

ఒమిక్రాన్‌ని అడ్డుకొనేందుకు పంజాబ్‌ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ని వేగవంతం చేసింది. టీకా వేసుకోకపోతే జీతాలు ఇవ్వబోమని ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టం చేసింది. రెండు డోసులు లేదా ఒక డోసు తీసుకున్నవారు తప్పనిసరిగా టీకా ధ్రువపత్రాన్ని సమర్పించాలని, లేకుంటే నెల జీతం బ్యాంక్‌ ఖాతాలో జమచేయబోమని తేల్చి చెప్పింది. గడువు ముగిసినా రెండో డోసు టీకా వేసుకోనివారు పంజాబ్‌లో 35 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇటీవల రాష్ట్రప్రభుత్వం టీకా ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.

జనవరి 1నుంచి వ్యాక్సిన్‌ రెండో డోసు తప్పనిసరి

హరియాణా ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా టీకాలు వేసుకోని వారిని జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని నిర్ణయించింది.   జనవరి 1 నుంచి రెండోడోసును తప్పనిసరి చేసింది. వ్యాక్సిన్‌ పూర్తయినవారినే షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, మార్కెట్లు, జిమ్‌లు, పార్కులు, ఫిట్‌నెస్‌ సెంటర్లు ఇతర ప్రదేశాలతో పాటు బస్‌ స్టాండ్లు, రైల్వే స్టేషన్లకు అనుమతించనున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ సెక్టార్‌ బ్యాంకుల్లో కూడా వ్యాక్సిన్‌ పూర్తయితేనే అనుమతించేలా ఉత్తర్వులు జారీచేసింది.  18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ టీకాలు తప్పనిసరి. పార్కులు, యోగశాలలు, జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో ఎంట్రీకి వ్యాక్సినేషన్‌ పూర్తి కావాల్సిందే. 

టీకా సర్టిఫికెట్‌ ఉంటేనే అసెంబ్లీలోకి ఎంట్రీ!

పుదుచ్చేరి శాసనసభలోకి రావాలంటే కరోనా టీకా వేయించుకున్నట్టు సర్టిఫికెట్‌ తప్పనిసరని స్పీకర్‌ సెల్వం ప్రకటించారు. ఇళ్లకే వెళ్లి టీకాలు వేసే పనులను ప్రస్తుతం పుదువైలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం శాసనసభ ప్రాంగణంలో టీకా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. శాసనసభ ప్రాంగణంలోకి వచ్చే వారికి సంబంధించి టీకా వేయించుకున్న ధ్రువపత్రాలను స్పీకర్‌ పరిశీలించారు. లేని వారికి టీకాలు వేశారు. ఇకపై శాసనసభలోకి రావాలంటే ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని తెలిపారు.

యూపీలో డిసెంబర్‌ 31వరకు 144 సెక్షన్

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా నిబంధనలు విధించింది. నోయిడా, లఖ్‌నవూ జిల్లాల్లో డిసెంబర్‌ 31 వరకు  144 సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని