అవయవ మార్పిడి: వ్యాక్సిన్‌ తీసుకున్నా మరింత జాగ్రత్త!

అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులు రెండు డోసులతో రక్షణ కల్పిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి చర్యలు మరింత అవసరమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Published : 10 May 2021 18:46 IST

అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు రెండు డోసులతో రక్షణ కల్పిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి చర్యలు మరింత అవసరమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అవయవ మార్పిడి వారిలో వ్యాక్సిన్‌ పనితీరుపై జరిగిన తాజా అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

వివిధ ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులపై కొవిడ్‌ వ్యాక్సిన్‌లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అవయవ మార్పిడి జరిగిన వ్యక్తుల్లో వ్యాక్సిన్‌ పనితీరుపై జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో మోడెర్నా, ఫైజర్‌ టీకా తీసుకున్న 658 మంది అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులపై అధ్యయనం చేపట్టారు. వీరిలో తొలిడోసు తీసుకున్న తర్వాత కేవలం 98 మందిలో(15శాతం), రెండో డోసులు తీసుకున్న అనంతరం 357 మందిలో సార్స్‌-కోవ్‌-2 ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ 259 మందిలో ఎలాంటి యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. కేవలం యువకుల్లోనే ఈ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇవి చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు.

అవయవ మార్పిడి జరిగిన వారిలో రెండు డోసులు తీసుకున్నప్పటికీ పూర్తి రక్షణ కల్పిస్తాయని చెప్పలేమనే విషయం తాజా అధ్యయనం ద్వారా స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త డోరీ సెగెవ్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ఆరోగ్యవంతులైన వారితో పోలిస్తే అవి తక్కువగానే ఉంటున్నాయని గుర్తించామన్నారు. అందుచేత అవయవ మార్పిడి జరిగిన వారితోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని