North India Rain: ఉత్తరభారత్‌లో భారీ వర్షాలు.. 100 మందికిపైగా మృతి

ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు 100 మందికిపైగా మరణించారు. పంజాబ్‌లో ఘగ్గర్‌ నదిపై మూడో చోట్ల గండిపడింది.  

Updated : 12 Jul 2023 14:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. హిమాచల్‌ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. పంజాబ్‌లో 15 మంది, ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడి 9 మంది చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఆస్తినష్టమే రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌, హరియాణల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది. 

1978 తర్వాత ఇదే యమున ఉగ్రరూపం..

మరోవైపు యుమునా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయి అయిన 205.33 మీటర్లను దాటి 207.18 మీటర్లకు చేరింది. గత పదేళ్లలో ఇదే అత్యధికం. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నీటి మట్టం 207.49 మీటర్లకు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ స్థాయి నీటి మట్టం 1978లో నమోదైంది. హరియాణా రాష్ట్రం భారీ స్థాయిలో నీటిని దిగువకు వదులుతుండటంతో పాత యుమున వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. దిల్లీలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • ఉత్తరాఖండ్‌లో నాలుగు జిల్లాలకు నేడు ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వీటిల్లో నైనిటాల్‌, చంపావత్‌, ఉదమ్‌సింగ్‌నగర్‌, పౌరీగఢ్‌వాల్‌ జిల్లాలకు ఇది వర్తిస్తుంది. హరిద్వార్‌, దేహ్రదూన్‌, తెహరీ గఢ్‌వాల్‌, రుద్రప్రయాగ్‌ జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేశారు. 
  • మరోవైపు పంజాబ్‌లో ఘగ్గర్‌ నదిపై ఉన్న మూనక్‌ వద్ద ఓ ఆనకట్ట మూడు చోట్ల దెబ్బతింది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. మరమ్మతులు నిర్వహించకపోవడతోనే ఈ ఆనకట్ట దెబ్బతిన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఫుల్లాడు, మక్రౌద్‌, చందు వద్ద ఆనకట్టకు గండ్లుపడ్డాయి. ఘగ్గర్‌ నదిలో ప్రమాదకర స్థాయి కంటే రెండు అడుగులు ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని