Rahul Gandhi: పట్నా హైకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే విధించింది. 

Published : 24 Apr 2023 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. ‘మోదీ’ అనే ఇంటిపేరును కించపర్చారంటూ బిహార్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 30న పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ 25వ తేదీన తమ ఎదుట వాంగ్మూలం నమోదు నిమిత్తం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.

 వాస్తవానికి మార్చి 18నే ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు.. ఏప్రిల్‌ 12న రాహుల్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతం సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ వ్యవహారంలో తాము బిజీగా ఉన్నందున విచారణ వాయిదా వేయాలని రాహుల్ (Rahul Gandhi) న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్‌ 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది. 

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ రాహుల్‌ తరపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం దిగువ కోర్టు ఆదేశాలపై మే 15వ తేదీ వరకు స్టే విధించింది. మరోవైపు భాజపా నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ దీనిపై మాట్లాడుతూ తాను వేసిన దావాలో కూడా రాహల్‌ గాంధీకి తగిన శిక్షపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీల గురించి 2019 ఎన్నికల ప్రచారం వేళ కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ (Rahul Gandhi) ప్రస్తావించారు. ఆ సందర్భంగా మోదీ అనే పేరు గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌లోని సూరత్‌లో పరువునష్టం దావా దాఖలైంది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని