PM Modi: తీగల వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగం.. వీడియో

గుజరాత్‌లోని మోర్బీ(Morbi tragedy)లో నిన్న సాయంత్రం తీగల వంతెన(Cable Bridge) కూలి 130మందికి పైగా మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు.

Published : 01 Nov 2022 01:58 IST

బనస్కాంత: గుజరాత్‌లోని మోర్బీ(Morbi tragedy)లో నిన్న సాయంత్రం తీగల వంతెన(Cable Bridge) కూలి 130మందికి పైగా మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్‌లోని బనస్కాంతలో పర్యటిస్తున్న సందర్భంగా థారాడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మోర్బీలో జరిగిన విషాదం భయంకరమైనది.. అత్యంత బాధాకరమైనదని చెమర్చిన కళ్లతో అన్నారు. అయితే, ఈ దుర్ఘటన నేపథ్యంలో బనస్కాంతలో ఈరోజు ఈ సభలో పాల్గొనాలా? వద్దా.. అని తనలో తాను ఆలోచించాననీ.. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఇక్కడి సంస్కృతే తన ధైర్యాన్ని కూడగట్టి ఇక్కడికి వచ్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. నీటి సరఫరాకు సంబంధించి రూ.8వేల కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిలో నీటి సరఫరా పైపులైన్లు, కాల్వల నిర్మాణాలు, 56 చెక్‌డ్యామ్‌లు కూడా ఉన్నట్టు తెలిపారు. త్వరలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని మోదీ మంగళవారం మోర్బీకి వెళ్లనున్నట్టు గుజరాత్‌ సీఎం కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. 

ఈ ఉదయం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించిన విషయం తెలిసిందే. ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా.. మోర్బీ ప్రమాదం నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నా.. నా మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోంది. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఓ వైపు గుండెల నిండా భరించలేని ఆవేదన ఉన్నా.. తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోంది’’ అని ఉద్వేగానికి గురయ్యారు. మోర్బీలో ఆదివారం సాయంత్రం మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి తీగల వంతెన కుప్పకూలి పెను ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 134 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని