PM Modi: యూట్యూబ్‌లో ప్రధాని మోదీ జోరు.. కోటి దాటిన సబ్‌స్క్రైబర్లు

పెద్దఎత్తున ఫాలోవర్లతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫాం ‘యూట్యూబ్‌’లోనూ దూసుకెళ్తున్నారు! ప్రసంగాలు, ఇతరత్రా కార్యక్రమాలు అందుబాటులో ఉండే నరేంద్ర మోదీ అధికారిక...

Published : 01 Feb 2022 15:11 IST

దిల్లీ: పెద్దఎత్తున ఫాలోవర్లతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫాం ‘యూట్యూబ్‌’లోనూ దూసుకెళ్తున్నారు!. ప్రసంగాలు, ఇతరత్రా కార్యక్రమాలతో అందుబాటులో ఉండే నరేంద్ర మోదీ అధికారిక ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారి సంఖ్య మంగళవారానికి కోటి దాటడం విశేషం. 2007లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫాంలో అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న గ్లోబల్ లీడర్‌ల జాబితాలో ప్రధాని మోదీయే ముందువరసలో ఉన్నారు. మొత్తం 36 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో.. రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్.. 30.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కేవలం 7.03 లక్షల సబ్‌స్క్రైబర్‌లు ఉండటం గమనార్హం. వైట్‌హౌస్‌ అధికారిక ఛానల్‌కు 19 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జాతీయ నాయకులతో పోల్చినా.. ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షలు, మరో నాయకుడు శశిథరూర్‌కు 4.39 లక్షలు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు 2.12 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మరోవైపు ప్రధానికి ట్విటర్‌లో 7.53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.68 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని