President Murmu: 4ఏళ్ల చిన్నారిపై హత్యాచారం.. దోషికి క్షమాభిక్ష పెట్టని రాష్ట్రపతి

President Rejects Mercy Petition: దాదాపు 15 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో ఓ నాలుగేళ్ల చిన్నారి పొరుగుంటి వ్యక్తి చేతితో దారుణ హత్యకు గురైంది. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అతడు, అనంతరం ఆమెను బండరాళ్లతో  చంపేశాడు. ఈ కేసులో దోషికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు.

Updated : 04 May 2023 18:04 IST

దిల్లీ: మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై అతి దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో దోషికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నిరాకరించారు. 2008 క్రితం నాటి కేసుకు సంబంధించి దోషి వసంత సంపత్‌ దుపారే దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ (mercy petition)ను ఆమె ఇటీవల తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం గురువారం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 28న దుపారీ క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ.. రాష్ట్రపతి సచివాలయానికి సిఫార్సు చేసింది. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 10వ తేదీనే రాష్ట్రపతి ముర్ము తిరస్కరించినట్లు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ తెలిపింది.

ఏంటీ కేసు..

2008లో మహారాష్ట్రలో ఓ నాలుగేళ్ల బాలిక, వసంత దుపారే (అప్పటికి అతని వయసు 46 ఏళ్లు) చేతిలో దారుణ హత్యాచారానికి (Rape and Murder Case) గురైంది. చిన్నారి పొరుగింట్లో ఉండే దుపారే.. తినుబండారాల ఆశ చూపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బండరాళ్లతో మోది హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుపారేను అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఆ శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది.

ఈ తీర్పుపై 2014లో దుపారే సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించగా అక్కడ ఊరట లభించలేదు. అతడి మరణశిక్షను అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ 2016లో దుపారే మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను 2017లో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అతడు చేసిన నేరం అత్యంత హేయమైనదని అప్పట్లో కోర్టు అభిప్రాయపడింది. అతడి మరణశిక్షను మరోసారి సమర్థించింది. దీంతో అతడు క్షమాభిక్ష కోరగా.. రాష్ట్రపతి (President Droupadi Murmu) అందుకు నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని