Snake Bite: వరద సహాయక చర్యల్లో.. పంజాబ్ మంత్రికి పాము కాటు!

వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన పంజాబ్‌ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ బైన్స్‌ పాము కాటుకు గురయ్యారు. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానంటూ వెల్లడించారు.

Published : 19 Aug 2023 18:50 IST

చండీగఢ్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని కిందికి విడుదల చేస్తుండటంతో పంజాబ్‌ (Punjab)లోని పలు జిల్లాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన పంజాబ్‌ విద్యాశాఖ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ బైన్స్‌ (Harjot Singh Bains).. పాము కాటు (Snake Bite)కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

హర్‌జోత్‌ సింగ్‌ ఇక్కడి రూప్‌నగర్‌ జిల్లాలోని ఆనంద్‌పుర్‌ సాహిబ్‌నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల హిమాచల్‌ నుంచి పెద్దఎత్తున వరదను కిందికి వదలడంతో బియాస్‌, సట్లెజ్‌ నదులు పొంగి.. స్థానికంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న రాత్రి సమయంలో ఆయన వరద సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ విషపూరిత పాము ఆయన్ను కాటేయగా.. వెంటనే ఆస్పత్రిలో చేరారు.

వర్ష బీభత్సానికి ‘హిమాచల్‌’ విలవిల.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సాయం!

‘సహాయక చర్యల్లో నిమగ్నమైన సమయంలో ఓ విషపూరిత సర్పం కాటేసింది. కానీ.. ప్రజలకు సాయం చేయాలనే నా సంకల్పాన్ని ఈ ఘటన అడ్డుకోలేకపోయింది. భగవంతుడు, ప్రజల ఆశీర్వాదంతో నేను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను. విషం ప్రభావం తగ్గుతోంది. రక్త పరీక్షల్లో అంతా సాధారణమని తేలింది’ అని మంత్రి చెప్పారు. మరోవైపు వరదల ధాటికి.. పంజాబ్‌లోని రూప్‌నగర్‌, గురుదాస్‌పుర్‌, హోషియార్‌పుర్‌, కపుర్తలా, ఫిరోజ్‌పుర్‌ జిల్లాలు ప్రభావితమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని