Rahul Gandhi: దేశ వ్యతిరేక వ్యాఖ్యలేం చేయలేదు.. సభలోనే బదులిస్తా.. లేకపోతే...: రాహుల్‌

భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మొదటిసారి స్పందించారు. తానెలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని మీడియాతో మాట్లాడారు.

Updated : 16 Mar 2023 13:56 IST

దిల్లీ: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తొలిసారి స్పందించారు. తానెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తూ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యం (Democracy) ప్రమాదంలో ఉందంటూ బ్రిటన్‌ వేదికగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్న అధికార భాజపా (BJP) నేతలు.. విదేశీ గడ్డపై భారత్ పరువు తీశారని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాహుల్‌ క్షమాపణలు చెప్పాలంటూ భాజపా గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు.. పార్లమెంట్ (Parliament) ఉభయ సభల్లోనూ ఈ విషయంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే... ‘విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించారు’ అంటూ భాజపా చేస్తోన్న ఆరోపణలపై స్పందిస్తారా? అని రాహుల్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ నన్ను అనుమతిస్తే సభలో మాట్లాడతానని, అవకాశం ఇవ్వకపోతే పార్లమెంట్‌ బయట మాట్లాడతాను’’ అని చెప్పారు. 

మరోవైపు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఈ వ్యవహారంలో రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు. దేశ వ్యతిరేకశక్తుల మాదిరి ఆయన మాట్లాడారంటూ మండిపడ్డారు. ‘‘రాహుల్‌ దేశాన్ని అవమానించేందుకు యత్నిస్తే పౌరులుగా మౌనంగా ఉండలేం. కాంగ్రెస్ నాయకత్వాన్ని తిరస్కరించినంత మాత్రాన.. ఆయన విదేశాల్లో భారత్‌ పరువు తీయొచ్చని అర్థం కాదు’’ అని మీడియాతో అన్నారు. అయితే భాజపా విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొడుతోంది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నవారే దానిని రక్షించాలని మాట్లాడుతుండటం దురదృష్టకరమని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని