Mumbai Rains: ముంబయిని ముంచెత్తిన వానలు.. రాయ్‌గఢ్‌లో ఇంకా దొరకని 83 మంది ఆచూకీ

మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ముంబయిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

Updated : 22 Jul 2023 13:28 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి నగరం, శివారులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వర్షాల కారణంగా ముంబయిలో 100కి పైగా లోకల్‌ రైళ్లు రద్దయ్యాయి. అటు ముంబయికి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శాంతాక్రూజ్‌ ప్రాంతంలో 203.7 మి.మీల వర్షపాతం నమోదైంది. బాంద్రాలో 160.5 మి.మీలు, విద్యావిహార్‌లో 186 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంధేరీ, కుర్లా, ఘాట్కోపర్‌, చెంబూర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అటు పుణె, కొంకణ్‌, మధ్య మహారాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. యవత్మాల్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులపైకి మోకాల్లోతు నీరు చేరింది.

రాజమహేంద్రవరం, భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి వరద ఉద్ధృతి

రాయ్‌గఢ్‌లో 25కు చేరిన మృతులు..

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. గ్రామంలో మొత్తం 48 ఇళ్లు ఉండగా.. కనీసం 17 ఇళ్లు కొండచరియల కారణంగా పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 

గ్రామంలో 229 మంది జనాభా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 25 మంది మృతిచెందగా మరో 10 గాయపడ్డారు. ఇంకో 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా 83 మంది ఆచూకీ తెలియరాలేదు. అయితే, ఘటన సమయంలో వీరిలో కొంతమంది గ్రామంలో లేరని తెలుస్తోంది. దీంతో కొండచరియల కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై సరైన స్పష్టత లేదు. ప్రస్తుతం ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటే.. వారు బతికే అవకాశాలు తక్కువే అని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాదిన కొనసాగుతున్న వర్ష బీభత్సం..

అటు ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో కొండచరియలు విరిగిపడి యమునోత్రి, బద్రీనాథ్‌ హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. కిన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఐదో నంబరు జాతీయ రహదారిని మూసివేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని