Hit and Run: ‘హిట్‌ అండ్‌ రన్‌’కు పరిష్కారం.. రవాణాశాఖ కీలక సూచన!

ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 05 Jan 2024 20:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిట్‌ అండ్‌ రన్‌ (Hit and Run) కేసుల్లో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు (Truck Drivers Protest) చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా అటువంటి ఘటనను (Road Accidents) ‘హిట్‌ అండ్‌ రన్‌’ కింద పరిగణించకుండా ఉండవచ్చని తెలిపింది. ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని.. తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని రవాణాశాఖ పేర్కొంది.

‘ప్రమాదం జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదం ఉందని ట్రక్కు డ్రైవర్లు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మనం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లు సాంకేతికత వాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25-50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అటువంటి దాన్ని ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండవచ్చు’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు సూచించామన్నారు.

ఏమిటీ ‘హిట్‌-అండ్‌-రన్‌’ నిబంధన? డ్రైవర్లలో ఎందుకింత ఆందోళన?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం కింద హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పొందుపరిచారు. ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయకుండా అక్కడి నుంచి తప్పించుకుంటే.. ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసు నమోదు చేస్తారు. అందుకు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.7లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధనను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టగా.. కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించే పనిలో పడింది. ఈ క్రమంలోనే తాజా సూచన చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని