Pegasus: పెగాసస్‌పై విచారణకు ‘సుప్రీం’ కమిటీ.. వచ్చేవారం ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది

Updated : 23 Sep 2021 13:28 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గురువారం వెల్లడించారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. 

ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌ సింగ్‌తో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ విషయాన్ని తెలిపారు. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్‌ కూడా ఒకరు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్‌ జస్టిస్‌ వెల్లడించారు. అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 

పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబరు 13న సుప్రీంకోర్టు విచారణ జరిపి.. మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్‌ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్‌ దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని