SKM: దేశవ్యాప్తంగా ‘రాజ్‌భవన్‌ మార్చ్‌‌’లకు రైతు సంఘాల పిలుపు

దిల్లీ సరిహద్దుల్లో తాము చేపట్టిన చారిత్రక పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్‌ 26న దేశ వ్యాప్తంగా ‘రాజ్‌భవన్‌ మార్చ్‌’లకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

Published : 26 Oct 2022 01:35 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఏడాదికి పైగా ఉద్యమించిన రైతు సంఘాల నేతలు తాజాగా మరో పిలుపు ఇచ్చారు. దిల్లీ సరిహద్దుల్లో తాము చేపట్టిన చారిత్రక పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్‌ 26న దేశ వ్యాప్తంగా ‘రాజ్‌భవన్‌ మార్చ్‌’లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలు రైతు సంఘాలతో ఏర్పాటైన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఎస్‌కేఎం సమన్వయ కమిటీ, డ్రాఫ్టింగ్‌ కమిటీలు వర్చువల్‌గా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే, రాజ్‌భవన్‌ మార్చ్‌, గవర్నర్లకు సమర్పించే వినతిపత్రాలకు తుదిరూపు ఇచ్చేందుకు మరోసారి నవంబర్‌ 14న దిల్లీలో సమావేశం కానున్నట్టు ఎస్‌కేఎం నేతలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వర్చువల్‌ భేటీలో ఎస్‌కేఎం నేతలు హన్నన్‌ మొల్లా, దర్శన్‌పాల్‌, యుధ్‌వీర్‌ సింగ్‌, మేధా పాట్కర్‌, రాజారాం సింగ్‌, అతుల్‌ కుమార్‌ అంజన్‌, సత్యవాన్‌, అశోక్‌ ధల్వాలే, అవిక్‌ సాహా, సుఖ్‌దేవ్‌ సింగ్‌, రామిందర్‌ సింగ్‌, వికాస్‌ శిశిర్‌, డా.సునీలం తదితరులు పాల్గొన్నారు. 

తమ పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎస్‌కేఎం నేతలు తెలిపారు. ‘రాజ్‌భవన్‌ మార్చ్‌’ కోసం పలు రాష్ట్రాల్లో సన్నాహాలు జరుగుతున్నాయని.. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, అటవీ సంరక్షణ చట్టం నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పుల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, తమ హక్కుల కోసం పోరాడుతున్న గిరిజన సంఘాలకు నవంబర్‌ 15న (దివంగత బిర్సా ముండా జయంతి రోజు) సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు.  సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2020 నవంబర్‌లో వేలాది మంది రైతులు (ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా నుంచి) దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి తీవ్ర నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో మోదీ సర్కార్‌ ఈ సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని కొనసాగించారు. దీంతో 2021 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఏడాదికి పైగా కొనసాగించిన తమ ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ఎస్‌కేఎం నేతలు ప్రకటించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు