Smriti Irani: మరి అదానీతో వాద్రా ఎందుకున్నారు..? రాహుల్‌కు స్మృతి ఇరానీ కౌంటర్‌

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ లండన్‌లో చేసిన వ్యాఖ్యలు, అలాగే మోదీ ఇంటిపేరును ఉద్దేశించి వాడిన పదజాలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఇబ్బందుల్లో పడేసింది. వీటిపై తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా స్పందించారు. 

Published : 28 Mar 2023 20:08 IST

దిల్లీ: అదానీ(Adani Group) వ్యవహారంలో కేంద్రాన్ని విమర్శిస్తోన్న కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఎదుర్కొనేందుకు భాజపా(BJP) ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా 2009నాటి చిత్రాన్ని ఉద్దేశించి రాహుల్‌పై విమర్శలు గుప్పించింది. ఆ చిత్రంలో  అదానీ-రాబర్ట్ వాద్రా పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకొంటున్నట్లు ఉంది. ‘రాహుల్ గాంధీకి అదానీ విషయంలో  ఇబ్బంది ఉంటే.. మరి ఆయనతో రాబర్ట్ వాద్రా ఎందుకు ఉన్నారు..? ’ అంటూ ప్రతిదాడి చేసింది. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) ఈ మేరకు ప్రశ్నించారు. 

యూకే పర్యటనలో భాగంగా ప్రధానిమోదీపై రాహుల్‌ (Rahul Gandhi)కున్న ద్వేషం స్పష్టంగా కనిపించిందన్నారు. ‘మోదీ(Modi)కున్న శక్తి ఆయన ఇమేజే.. దానిని దెబ్బతీసే దిశగా నేను పనిచేస్తానంటూ 2019 మే నెలలో రాహుల్ అన్నారు. గాంధీ కుటుంబం అలా మాట్లాడటం మొదటిసారేం కాదు. రాజకీయ అసహనంలో ఉన్న ఆయనకు మోదీపై ఉన్న విద్వేషం యూకే పర్యటనలో కనిపించింది. మోదీని విమర్శించే క్రమంలో.. మొత్తం ఓబీసీ వర్గాన్ని విమర్శించడం సరైందనుకున్నారు. అయితే, ప్రధాని ఇమేజ్‌ను దెబ్బతీయాలనే రాహుల్ కోరిక నెరవేరలేదు. ఎందుకంటే ఈ దేశ ప్రజలే మోదీకున్న శక్తి’ అంటూ ఇరానీ విరుకుపడ్డారు. 

మోదీ (Modi) ఇంటి పేరును కించపర్చారన్న కేసులో మార్చి 23న గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు.. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సెక్రటేరియేట్‌ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అదానీ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే తనపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారని ఇటీవల రాహుల్‌ ఆరోపిస్తున్నారు. అదానీ గ్రూప్‌పై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. వాటిపై దర్యాప్తు చేయడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రధానిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని