Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. 143కి చేరిన మృతుల సంఖ్య

హిమాలయ దేశం నేపాల్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈ విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 04 Nov 2023 17:27 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు కనీసం 143 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

6.4 తీవ్రతతో భూకంపం

శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు రాజధాని కాఠ్‌మాండూలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి.  మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ సంతాపం ప్రకటించారు. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9వేల మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. 

మృతుల్లో.. స్థానిక సంస్థ డిప్యూటీ హెడ్‌

ఈ ప్రకృతి విపత్తులో జజర్‌కోట్‌ జిల్లాలోని నల్‌గఢ్‌ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్‌ సరితా సింగ్‌ మృతిచెందారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న నివాసం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

దిల్లీని తాకిన భూ ప్రకంపనలు

మరోవైపు, ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న దేశ రాజధాని దిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

భూకంప ప్రభావిత ప్రాంతాలకు ప్రచండ

ఈ ఉదయం దేశ ప్రధాని పుష్ప కుమార్‌ దహల్‌ ప్రచండ వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.

నేపాల్‌కు అండగా ఉంటాం: మోదీ

ఈ భూకంప విపత్తుపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. భూకంప మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని