Gujarat Trajedy: తీగల వంతెన దుర్ఘటనపై సుప్రీంలో పిటిషన్‌

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన దుర్ఘటనపై జ్యుడిషియల్‌ దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది.

Published : 01 Nov 2022 13:21 IST

దిల్లీ: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఘటనపై రిటైర్డ్‌ జడ్జీ నేతృత్వంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి..  దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై నవంబరు 14న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

గుజరాత్‌ సీఎం రాజీనామా చేయాలి: కేజ్రీవాల్‌

వంతెన కూలడం వెనక మానవ తప్పిదాలతో పాటు నిర్వహణ లోపాలు కూడా బయటపడుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు గుజరాత్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ ఘటనపై జ్యుడిషియల్‌ దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఘటనపై తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగిపోయి ఎన్నికలకు వెళ్లాలన్నారు.

గత ఆదివారం సాయంత్రం మోర్బీ నగరంలోని తీగల వంతెన కూలి 134 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇంకా పలువురు నదిలో గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ నేడు పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని