Buddhadeb Bhattacharya: కోల్‌కతా వీధుల్లో.. మాజీ సీఎం మరదలు

పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష సీనియర్‌ నేత బుద్దదేవ్‌ భట్టాచార్య మరదలు ఇరా బసు ప్రస్తుతం కోల్‌కతా వీధుల్లో దీన స్థితిలో జీవనం సాగిస్తున్నారు.

Updated : 11 Sep 2021 13:15 IST

దీన స్థితిలో రిటైర్డ్‌ టీచర్‌

కోల్‌కతా: ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రికి సమీప బంధువు. అంతకుమించి చేతిలో పీహెచ్‌డీ పట్టా.. ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీవిరమణ.. స్థానిక భాషతో పాటు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం.. ఇన్ని విశేషాలున్న ఓ మహిళ.. ప్రస్తుతం చెరిగిన జుట్టు, మాసిన దుస్తులతో ఓ ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. అంతేకాదు తోపుడు బండ్ల వారు అందించే ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగించడం అందర్నీ కలచివేస్తోంది. ఆమె ఎవరో కాదు పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష సీనియర్‌ నేత బుద్దదేవ్‌ భట్టాచార్య మరదలు ఇరా బసు.

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్దదేవ్‌ భట్టాచార్య భార్య మీరా సోదరి ఇరా బసు ప్రస్తుతం కోల్‌కతా వీధుల్లో దీన స్థితిలో ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పశ్చిమబెంగాల్‌లో నార్త్‌ 24 పరగణాల జిల్లాలోని ప్రియనాథ్‌ బాలికోన్నత పాఠశాలలో 1976 నుంచి ఆమె టీచర్‌గా సేవలందించారు. దాదాపు 34ఏళ్లపాటు అదే పాఠశాలలో పనిచేసిన ఇరా బసు.. 2009లో పదవీ విరమణ పొందారు. తర్వాత అప్పటివరకు నివాసమున్న చోటునుంచి ఇరా బసు మకాం మార్చారు. అప్పటినుంచి ఎవ్వరికీ కనిపించకుండా పోయిన ఇరా బసు.. గత కొంతకాలంగా డన్‌లాప్ జంక్షన్‌ వద్ద ఉంటున్నట్లు పూర్వ విద్యార్థులు గుర్తించారు.

అయితే, తమ టీచర్‌ పరిస్థితిని చూసి చలించిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది సహాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. పెన్షన్‌ పొందేందుకు దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లను ఇవ్వకపోవడంతో ఆమెకు పెన్షన్‌ కూడా మంజూరు కాలేదని పాఠశాల సిబ్బంది వెల్లడించారు. తాజాగా ఆమె వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో స్పందించిన అధికారులు ఆమెను స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ మహిళా హోంకు తరలిస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే, తాను వైరాలజీలో పీహెచ్‌డీ పొందడమే కాకుండా రాష్ట్రస్థాయి క్రీడాకారిణి అని ఇరా బసు చెబుతుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని