Delta Variant: 80శాతం కేసులకు ఇదే కారణం..!

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తుపానులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా నమోదైన 80శాతం పాజిటివ్‌ కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

Updated : 19 Jul 2021 16:00 IST

ఆల్ఫాతో పోలిస్తే 40-60శాతం అధిక వ్యాప్తి

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తుపానులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా నమోదైన 80శాతం పాజిటివ్‌ కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా రకానికి 40 నుంచి 60శాతం అధికంగా వ్యాప్తిచెందే సామర్థ్యం ఉందని తెలిపారు. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌ను సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్‌ వర్కింగ్‌ నిపుణులు స్పష్టం చేశారు.

వైరస్‌ తీవ్రతకు కారణం ఇదే..!

భారత్‌లో డెల్టా వేరియంట్‌ (B.1.617.2) గతేడాది అక్టోబర్‌లో వెలుగు చూసింది. అత్యధిక వ్యాప్తి కలిగిన ఈ వేరియంట్ వల్లే సెకండ్‌ వేవ్‌లో 80శాతం కేసులు నమోదైనట్లు కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. స్పైక్‌ ప్రొటీన్‌లో మ్యుటేషన్లు కణాల ఉపరితలంపై ఉండే ACE2 రెసెప్టార్లతో బలంగా బంధించేలా దోహదం చేసింది. తద్వారా వైరస్‌ను విస్తృతంగా వ్యాప్తి చేయడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగించింది. కేసుల సంఖ్య పెరగడానికి ఈ రకం కారణం అయినప్పటికీ ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని తీవ్రత ఎక్కువగా ఉందని కచ్చితంగా చెప్పలేం’ అని ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. అయినప్పటికీ ఊపిరితిత్తుల్లో వాపు వంటి లక్షణాలకు ఇది కారణమైనట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు డెల్టా వేరియంట్‌పై సమర్థంగానే పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్‌ జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఎన్‌కే అరోరా గుర్తుచేశారు.

కొత్త వేరియంట్లు వస్తే కేసులు పెరుగుతాయ్‌..

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోందని.. వ్యాక్సినేషన్‌ పెంచడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడం వంటి చర్యలవల్ల మూడో ముప్పును ఆలస్యం చేయవచ్చని ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌లు వెలుగు చూస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 10 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల సహాయంతో వాటి తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతినెల 50వేల శాంపిళ్లకు సీక్వెన్సింగ్‌ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం దేశంలో మొత్తం జిల్లాలను 180-190 క్లస్టర్లుగా విభజించి ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా బాధితుల స్వాబ్‌ నమూనాలను సేకరిస్తున్నామని ఎన్‌కే అరోరా తెలిపారు.

11రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌..

డెల్టా తర్వాత వెలుగు చూసిన డెల్టా ప్లస్‌ రకం భారత్‌లో ఇప్పటికే 11 రాష్ట్రాల్లో విస్తరించిందని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా వెల్లడించారు. ఇప్పటివరకు 55 నుంచి 60కేసులు గుర్తించామన్నారు. ఈరకం వైరస్‌ వ్యాప్తి సామర్థ్యం, వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకునే లక్షణాలపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని