Fourth Dose: నాలుగో డోసుకు సిద్ధమవుతోన్న ఇజ్రాయెల్‌..!

ప్రపంచంలో వ్యాక్సిన్‌ పంపిణీలో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్‌ మాత్రం అవసరమైతే నాలుగో డోసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

Published : 14 Sep 2021 01:45 IST

ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తం

జెరుసలెం: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాలు మాత్రం వ్యాక్సిన్‌ కొరతతో అల్లాడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని సంపన్న దేశాలు ఇప్పటికే బూస్టర్‌ డోసు పంపిణీ మొదలుపెట్టగా మరికొన్ని దేశాలు మూడో డోసు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వ్యాక్సిన్‌ పంపిణీలో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్‌ మాత్రం అవసరమైతే నాలుగో డోసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం తగినన్ని వ్యాక్సిన్‌ డోసులను సమీకరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

‘నాలుగో డోసు ఎప్పటినుంచి ఇస్తామనే విషయం ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆరు నెలల్లోపు ఉంటుందని అనుకోవడం లేదు. మూడో డోసు ఎక్కువ రోజులు పనిచేస్తుందని భావిస్తున్నాం. ముందుజాగ్రత్తగా నాలుగో డోసు కోసం వ్యాక్సిన్‌ సేకరించే పనిలో నిమగ్నమయ్యాం’ అని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నాచ్‌మన్‌ యాష్‌ పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా దేశంలో ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.

టీకా తీసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ రేటు అధికం..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్న ఇజ్రాయెల్‌లో దాదాపు ఎక్కువ భాగం ఫైజర్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. అక్కడ దాదాపు అర్హులందరికీ (70లక్షల మందికి) తొలి రెండు డోసులు అందించారు. ఆగస్టు నెలలో బూస్టర్‌ డోసు పంపిణీ కూడా ప్రారంభించారు. ఇవి కూడా దాదాపు 28లక్షల మందికి అందించింది. అయితే, అక్కడ 90శాతం మంది రెండు డోసులు తీసుకున్నప్పటికీ సెప్టెంబర్‌ తొలివారంలో భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఇన్‌ఫెక్షన్‌ రేటు అధికంగా ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ముందు తీసుకున్న డోసుల వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు కొన్ని నెలల్లోనే క్షీణిస్తాయని వస్తోన్న నివేదికల నేపథ్యంలో మూడో డోసు పంపిణీ చేపట్టామని అక్కడి ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో అవసరమైతే నాలుగో డోసు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.

ఇక బూస్టర్‌ డోసు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సుముఖంగా లేదు. కేవలం దీర్ఘకాలిక రోగులకు, వృద్ధులకు అవసరమైతే ఇవ్వాలని మాత్రమే సూచిస్తోంది. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు యూరప్‌ దేశాలు మూడో డోసును అందించేందుకు సిద్ధమయ్యాయి. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీలను తమ గుప్పిట్లో పెట్టుకున్న సంపన్న దేశాలు, అక్కడి కంపెనీలు పేద దేశాల ప్రజలను నిర్లక్ష్యం చేస్తామంటే ఊరుకునేది లేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ ఈమధ్యే పేర్కొన్నారు. కనీసం పేద దేశాలు వ్యాక్సిన్‌ పొందేనాటికైనా.. ఆయా దేశాలు మూడో డోసు పంపిణీ చేపట్టవద్దని పిలుపునిచ్చారు. అయినప్పటికీ పలు దేశాలు మాత్రం బూస్టర్‌ డోసుల పంపిణీకి మొగ్గుచూపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని