Vaccination: దేశంలో 86శాతం మందికి తొలి డోసు పూర్తి..!

దేశంలో కొవిడ్‌ టీకా తీసుకునేందుకు అర్హులైన (18ఏళ్లకు వయసు పైబడిన) వారిలో 86శాతం మందికి తొలిడోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీవయ పేర్కొన్నారు.

Updated : 10 Dec 2021 19:41 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

దిల్లీ: దేశంలో కొవిడ్‌ టీకా తీసుకునేందుకు అర్హులైన (18ఏళ్లకు వయసు పైబడిన) వారిలో 86శాతం మందికి తొలిడోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీవయ పేర్కొన్నారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగుతోందన్నారు. సాధ్యమైనంత త్వరలోనే 100శాతం అర్హులకు తొలి డోసు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మన్‌సుఖ్‌ మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ సమాధానం ఇచ్చారు.

‘ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 131కోట్ల డోసులు పంపిణీ చేశాం. వీటిలో 80కోట్ల మంది (86శాతం) అర్హులకు తొలిడోసు అందించగా.. 47.91కోట్ల మందికి (51.0శాతం) రెండు డోసులు పూర్తయ్యాయి. త్వరలోనే 100శాతం అర్హులకు టీకా ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రాల దగ్గర 7 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కలుగుతాయంటూ వచ్చే వార్తలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి’ అని మన్‌సుఖ్‌ మాండవీయ స్పష్టం చేశారు.

59 దేశాల్లో ఒమిక్రాన్‌..

ఇక ఒమిక్రాన్‌పై మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.. ఇప్పటివరకు దేశంలో 23 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో ఈ వేరియంట్‌ వెలుగు చూసిందన్న ఆయన.. ఈ వేరియంట్‌ను వ్యాక్సిన్‌లు ఏ మేరకు ఎదుర్కొంటున్నాయనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త వేరియంట్‌పై టీకాల సామర్థ్యంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా 36 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లు ఉన్నాయని.. వీటికి 30వేల పరీక్షలు చేపట్టే సామర్థ్యం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. వీటితో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల సహాయంతో ఈ సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక బూస్టర్‌ డోసు అవసరమా? లేదా? అనే విషయంపై కసరత్తు జరుగుతోందని.. ఇందులో భాగంగా నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI), నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌లు (NEGVAC) చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని