
Bombay HC: ట్విటర్‌లోనే కాదు.. కోర్టులో రిప్లై ఇవ్వండి..!
మహారాష్ట్ర మంత్రికి బాంబే హైకోర్టు చురకలు
ముంబయి: నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబయి జోనల్ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు.. మంత్రి నవాబ్ మాలిక్‌కు చురకలు అంటించింది. పరువు నష్టం దావాపై ట్విటర్‌లో స్పందించినట్లుగానే కోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేయవచ్చని సూచించింది. మంగళవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన బాంబే హైకోర్టు.. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
సమీర్ వాంఖడే పరువుకునష్టం వాటిల్లే విధంగా నవాబ్ మాలిక్ రోజు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేస్తున్నారని ధ్యాన్‌దేవ్ వాంఖడే తరపున న్యాయవాది అర్షద్ షేక్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సమీర్ వాంఖడే మరదలు హర్షదా దీనానత్ రేడ్కర్‌కు డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధముందంటూ ట్విటర్‌లో మరోసారి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. వీరి వాదనలు విన్న న్యాయస్థానం.. ఇకవేళ ట్విటర్‌లో ఇచ్చినట్లే కోర్టులోనూ స్పందించవచ్చంటూ వ్యాఖ్యానించింది.
మంత్రి నవాబ్ మాలిక్‌పై వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ మత విశ్వాసాలను అవమానిస్తూ మాలిక్ ఆరోపణలు చేస్తున్నారని, దీని వల్ల తమ కుటుంబ గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లిందని ధ్యాన్‌దేవ్ పేర్కొన్నారు. ఇలా మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల్లో తన కుమారుడితోపాటు తమ కుటుంబ పరువుకు నష్టం కలిగించినందుకు గానూ రూ.1.25కోట్ల పరిహారం ఇచ్చేలా నవాబ్ మాలిక్‌ను ఆదేశించాలని కోరారు. వీటితోపాటు ఆయన చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని ధ్యాన్‌దేవ్ వాంఖడే పరువునష్టం దావాలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.