Jammu and Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ‘జైషే మొహమ్మద్‌’కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు...

Updated : 21 Aug 2021 22:23 IST

మృతుల్లో ఒకరు భాజపా నేత రాకేశ్‌ పండితా హత్య కేసులో నిందితుడు

శ్రీనగర్‌: కశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ‘జైషే మొహమ్మద్‌’కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకర్ని వకీల్‌ షాగా గుర్తించారు. జూన్‌లో జరిగిన భాజపా నేత రాకేశ్‌ పండితా హత్య కేసులో ఇతనూ ఒక నిందితుడని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. సైనికులు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఘటనాస్థలం నుంచి మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యాధికారులు వెల్లడించారు. ఈ విషయమై విక్టర్‌ ఫోర్స్‌ జీవోసీ మేజర్‌ జనరల్‌ రషీమ్‌ బాలి మాట్లాడుతూ.. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులకు చోటులేదనే విషయం ఈ ఎన్‌కౌంటర్‌తో స్పష్టమవుతోందన్నారు. శుక్రవారం సైతం శ్రీనగర్‌ సమీపంలోని ఖ్రూ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు రాజౌరి జిల్లాలోని తానామండీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో) అమరుడయ్యారు. ఇదే దాడిలో ఒక ఉగ్రవాది సైతం హతమయ్యాడు. కుల్గాం జిల్లాలో జరిగిన మరో ఘటనలో అప్నీ పార్టీకి చెందిన నేత గులాం హసన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని