Twitter: ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతా నిలిపివేత

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతాకు గంటపాటు యాక్సిస్‌ నిలిపివేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు

Published : 25 Jun 2021 16:15 IST

గంట తర్వాత పునరుద్ధరించిన సంస్థ

దిల్లీ: కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. 

‘‘ఫ్రెండ్స్‌.. ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. ట్విటర్‌ దాదాపు గంట పాటు నా ఖాతాను యాక్సిస్‌ చేసుకోనివ్వలేదు. అమెరికా డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పి నా ఖాతాను కొంతసేపు బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత యాక్సిస్‌ను పునరుద్ధరించింది’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ట్విటర్‌ చర్యలు నూతన ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఖాతాను యాక్సిస్‌ను నిలిపివేసే ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. 

‘‘నేను పోస్ట్‌ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్‌ ఛానల్‌ గానీ, ఏ యాంకర్‌ గానీ కాపీరైట్‌ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేశామని ట్విటర్‌ చెబుతోంది. నిజానికి ట్విటర్‌ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉంటార’’ని కేంద్రమంత్రి  అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విటర్‌ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవేళ ట్విటర్‌ ఆ నిబంధనలను అమలు చేస్తే.. తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా బ్లాక్‌ చేసే అవకాశం ఉండదు కదా..’’ అని ఆయన సామాజిక మాధ్యమ సంస్థకు చురకలంటించారు. ఇంతజరిగినా.. నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

కేంద్రం, ట్విటర్‌ మధ్య గత కొంతకాలంగా తరచూ వివాదం రాజుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకురాగా.. ట్విటర్‌ వాటిని అమలు చేయలేదు. నిబంధనల ప్రకారం.. స్థానిక అధికారులను నియమించడంలో సంస్థ విఫలమవడంతో ట్విటర్‌ మధ్యవర్తి రక్షణ హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో పలు రాష్ట్రాల్లో క్రిమినల్‌ కేసులు కూడా నమోదవడం గమనార్హం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని