బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. 9 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఎన్నికల వేళ మరోసారి హింస చెలరేగింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Updated : 08 Jul 2023 15:20 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘర్షణల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో కొందరు తృణమూల్‌ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని టీఎంసీ తమ ట్విటర్‌ ఖాతాలో వెల్లడిస్తూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

 ‘‘ఎన్నికల వేళ దిగ్భ్రాంతికర ఘటనలు జరుగుతున్నాయి. రేజినగర్‌, తుపాన్‌గంజ్‌, ఖర్‌గ్రామ్‌ ప్రాంతాల్లో మా పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. దోమ్‌కోల్‌లో మరో ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని భాజపా, సీపీఎం, కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశాయి. ఇప్పుడు ఆ కేంద్ర బలగాలు ఏమయ్యాయి?’’ అని టీఎంసీ మండిపడింది.

పోలింగ్ కేంద్రాలు ధ్వంసం..

పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్‌ పత్రాలను దగ్ధం చేశారు. రాణినగర్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. డైమండ్ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సుల్లో పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓట్లు వేశారని భాజపా ఆరోపించింది. జల్‌పాయ్‌గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. భాజపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్‌ ఆరోపించింది. ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది రాష్ట్ర పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 2.06లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని