Amul: అమూల్‌ బేబీ ఏడుస్తోంది.. మళ్లీ రావా డాచున్హా..!

అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ సృష్టికర్త సిల్వస్టర్‌ డాచున్హా (Sylvester daCunha) మృతిపై సామాజిక మాధ్యమాల్లో  పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మళ్లీ రావాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Published : 23 Jun 2023 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అమూల్‌’.. (Amul) ఈ పేరు చెప్పగానే ఓ చిన్న పాపాయి కార్టూన్‌ గుర్తుకు వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ‘అమూల్‌ గర్ల్‌’ (Amul girl) రూపకర్త డాచున్హా కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ సిల్వెస్టర్‌ డాచున్హా (sylvester dacunha) మంగళవారం కన్నుమూశారు. దీంతో ఆయన కార్టూన్లకు ఫిదా అయిన చాలా మంది సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘అమూల్‌ బేబీ ఏడుస్తోంది.. మళ్లీ రావా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘అట్టర్లీ-బట్టర్లీ’ (Utterly Butterly) ప్రచారంతో 1966లో తొలిసారిగా ఆయన అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ను గీశారు. అప్పటి నుంచి దీనికి ఎంతో పేరు వచ్చింది.

ఈ ఆలోచన అప్పటిదే..

ప్రకటనల సంస్థ ‘ఏఎస్‌పీ’లో మేనేజర్‌గా ఉన్న సమయంలో డాచున్హా అమూల్‌ కార్టూన్‌ను గీశారు.  నిజానికి ఆ ఆలోచన ఆయన సతీమణి నిషా డాచున్హా తీసుకొచ్చారట. ఆమె ‘అట్టర్లీ అమూల్‌’ అని ప్రతిపాదించగా..  డాచున్హా దానికి ‘బట్టర్లీ’ అనే పదాన్ని జత చేశారట. అమూల్‌ ట్యాగ్‌లైన్‌ ‘అట్టర్లీ బట్టర్లీ అమూల్‌’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో అమూల్‌ మిల్క్‌ ప్యాకెట్లు, వెన్నను మాత్రమే ఉత్పత్తి చేసే ఈ సంస్థ క్రమంగా అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తొలినాళ్లలో డాచున్హా ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, విజువలైజర్‌, కార్టూనిస్ట్‌ యూస్టేస్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి పని చేశారు. అలా పని చేస్తున్నప్పుడే ఆయనకు ఈ ఆలోచన వచ్చిందట.. తెల్లటిగౌనుపై ఎర్రటి చుక్కలు, ఎర్రటి బూట్లు, మ్యాచింగ్ రిబ్బన్‌లు, పెద్దకళ్లతో ఓ కార్టూన్‌ గీశారట. ఆ తర్వాత దానిని భారీ కటౌట్లు, వాల్‌పోస్టర్ల  రూపంలో ప్రదర్శించడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సొంతంగా అడ్వర్టైజ్‌ ఏజెన్సీని ప్రారంభించి..

1969లో డాచున్హా సొంతంగా  ‘డాచున్హా కమ్యూనికేషన్స్‌’ పేరుతో అడ్వర్టైజ్‌ ఏజెన్సీని ప్రారంభించారు. పార్టీ, పత్నీ/వాహ్‌?, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, బోమ్‌ బై’ తదితర కార్టూన్‌లు విశేష ఆదరణ పొందాయి. అమూల్‌ తన వ్యాపారాన్ని విస్తరించిన తర్వాత తన ప్రకటనల కోసం ప్రింట్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంది. దీంతో కార్టూన్‌లకు విశేష ఆదరణ లభించింది.  వాటిలో కొన్ని ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సందర్భానుసారంగా పత్రికల్లో అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌లను ఇవ్వడం డాచున్హా ప్రత్యేకత. ఉదాహరణకు 2008లో భారత్‌ చంద్రయాన్‌-1 మిషన్‌ను చేపట్టినప్పుడు ‘చార్‌చంద్‌ లగ్‌ గయే’ పేరుతో కార్టూన్‌ గీశారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు ‘యూనియన్‌ కి హర్‌ టెర్రిటొరీ మే’ పేరుతో కార్టూన్‌లను అమూల్‌ ప్రచురించింది.  

2011లో స్టీవ్‌జాబ్స్‌ మృతి చెందిన సమయంలో ‘యాపిల్‌ ప్రధాన వ్యక్తిని కోల్పోయింది’ అంటూ కార్టూన్‌ ప్రత్యక్షమైంది. సందర్భానికి అతికినట్టుగా ఇలాంటి ఎన్నో రూపొందించిన డాచున్హా.. ఇకలేరన్న వార్తతో ఆయన అభిమానుల గుండెలు బరువెక్కుతున్నాయి. అమూల్‌ బేబీ ఏడుస్తోంది. మళ్లీ రావా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.  ఆయన  విశేషాలతో ‘బీక్యూ ప్రైమ్‌’ ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. డాచున్హాకు భార్య నిషాతో పాటు కుమారుడు రాహుల్‌ డాచున్హా ఉన్నారు. ఆయనకు ‘ఎడ్వర్టైజింగ్‌ గురు’గా పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని