Ayalaan: ‘అయలాన్‌’ సీక్వెల్.. ఆ ఒక్క దానికే రూ. 50 కోట్లు!

శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అయలాన్‌’. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఖరారైంది.

Published : 23 Jan 2024 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో సీక్వెల్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పుడా జాబితాలో ‘అయలాన్‌’ (Ayalaan) చేరింది. శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు ఆర్‌. రవికుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై ఆకట్టుకుంది. తాజాగా దానికి సీక్వెల్‌ ఖరారైంది. ఈ మేరకు కేజేఆర్‌ స్టూడియోస్‌, ఫాంటమ్‌ డిజిటల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘అయలాన్‌ 2’ (Ayalaan 2) పేరుతో రూపొందనున్న ఆ సినిమా వీఎఫ్‌ఎక్స్‌కే ప్రస్తుతానికి రూ. 50 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో ఆ బడ్జెట్‌ పెరగొచ్చని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘అయలాన్‌ 2’ కోసం పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. విజువల్స్‌ పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేందుకు శ్రమిస్తాం’’ అని ఫాంటమ్‌ డిజిటల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థ అధినేత, సీఈవో బెజోయ్‌ అర్పుతరాజ్‌ తెలిపారు. సీక్వెల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా వెల్లడించలేదు. ‘‘అయలాన్‌’ హాలీవుడ్‌ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో క్వాలిటీ విషయంలో మేం రాజీ పడలేదు. వీఎఫ్‌ఎక్స్‌ ప్రాధాన్య చిత్రమిది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు శ్రమించాం’’ అని నిర్మాత కోటపాడి జె.రాజేశ్‌ ఓ సందర్భంలో చెప్పారు. పార్ట్‌ 2లోనూ వీఎఫ్‌ఎక్స్‌ కీలక పాత్ర పోషించనుందని కాబట్టి సినీ ప్రియులు కొంతకాలం వేచి చూడాల్సిందే.

‘హను-మాన్‌’ సీక్వెల్‌ షురూ.. ప్రకటించిన దర్శకుడు

భూమి మీదకు వచ్చిన గ్రహాంతర వాసి.. హీరోతో పరిచయం ఎలా ఏర్పరచుకుంది? అసలు ఆ ఏలియన్‌ రావడానికి గల కారణమేంటి? వంటి అంశాలతో పార్ట్‌ 1 రూపొందింది. ఇందులోని విజువల్స్‌, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఇషా కొప్పికర్‌, శరద్‌ కేల్కర్‌, యోగిబాబు, భానుప్రియ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తమిళంలో ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పార్ట్‌ 1.. తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది. మరోవైపు, సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన తెలుగు చిత్రం ‘హను-మాన్‌’కూ సీక్వెల్‌ ఖరారైంది. ‘జై హనుమాన్‌’ పేరుతో పార్ట్‌ 2 రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని