బాలీవుడ్‌లో సందడి మొదలవుతోంది!

వెండితెరపై వెలుగులను రెట్టింపు చేసేందుకు బాలీవుడ్‌ చిత్రాలు వరుసకడుతున్నాయి. కరోనా కారణంగా

Published : 22 Feb 2021 12:43 IST

వెండితెరపై వెలుగులను రెట్టింపు చేసేందుకు బాలీవుడ్‌ చిత్రాలు వరుసకడుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్రాలు థియేటర్లలో సినీ ప్రియులను అలరించేందుకు ముస్తాబవుతున్నాయి.

సినీ అభిమానులతో పాటు క్రీడాభిమానులు ఏడాది పాటు ఎంతో ఆసక్తిగా నిరీక్షించిన చిత్రం ‘83’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ అందుకున్న మధుర క్షణాలే ఇతి వృత్తంగా క్రీడా   నేపథ్యంలో ఈ సినిమా రానుంది. గతేడాది  ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కొవిడ్‌   కారణంగా వాయిదా పడింది. ఏడాది ఎదురుచూపులకు స్వస్తి పలుకుతూ జూన్‌ 4న థియేటర్లలో ‘83’ మీ ముందుకు రానుందంటూ ఆ నిర్మాతలు ప్రకటించారు. ‘‘చిరకాలం గుర్తుండిపోయేలా భారత్‌కు ప్రపంచకప్‌ విజయానందించిన   ప్రతీ ఒక్క క్రీడాకారుడికి చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. అందుకే జూన్‌ 4న విడుదల చేసి.. ఆ చిత్ర విజయ సంబురాలను.. ప్రపంచకప్‌   గెలుపొందిన రోజు.. అంటే జూన్‌ 25న జరుపుకొనేలా సిద్ధం చేశాం.     ఒకే రోజు సినీ, క్రీడా ప్రియులకు ఆరోజు పెద్ద పండగగా నిలుస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. నటులు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణే వివాహం అనంతరం కలిసి నటించిన ఈ చిత్రంలోనూ వీరిద్దరూ భార్యభర్తలు పాత్రలు పోషించడం విశేషం. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఇందులో బొమాన్‌ ఇరానీ, సాకిబ్‌ సలీమ్‌, జీవా, పంకజ్‌ త్రిపాఠి, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

* క్రీడా నేపథ్యంలో రానున్న మరో చిత్రం ‘ఝుండ్‌’. ఎన్జీవో స్లమ్‌సాకర్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ బార్స్రే జీవిత ఆధారంగా తెర  కెక్కిన ఇందులో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ ముఖ్యపాత్ర పోషించారు. వీధిపిల్లల్లో స్ఫూర్తిని నింపి ఓ ఫుట్‌బాల్‌ జట్టును ఏర్పాటు చేసే ఫ్రొఫెసర్‌ పాత్రలో ఆయన నటించారు.   నాగ్‌రాజ్‌ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 18న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో సందడి చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా బిగ్‌బి   పంచుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. గులాబో సితాబో చిత్రం   తరువాత అమితాబ్‌ నుంచి వస్తున్న చిత్రమిదే.

* పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత, ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షేర్‌షా’. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ నటీనటులుగా బయోగ్రాఫికల్‌ వార్‌ యాక్షన్‌ నేపథ్యంలో రానున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్‌ దర్శకత్వం వహించగా, కరణ్‌జోహార్‌ నిర్మాత. గతేడాది అక్టోబర్‌లో షూటింగ్‌ ముగించుకుని ఈ ఏడాది జులై 2న థియేటర్లలో విడుదలకానుంది. ఈ    సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు సిద్ధార్థ్‌ మల్హోత్రా. ఆర్మీ యూనిఫాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, సరికొత్త అవతారంలో ఆయన కనిపించనున్నారు.

* ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు జాన్‌ అబ్రహం నుంచి ఈ ఏడాదిలో మూడు చిత్రాలు రానున్నాయి. వాటిలో రెండు సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎటాక్‌’. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఆదివారం ప్రకటించింది. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ వాస్తవ కథతో తెరకెక్కింది.

* జాన్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముంబయి సాగా’. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు థియేటర్‌లోనే మార్చి 19న విడుదల చేయబోతున్నారట. కేంద్రం వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. సంజయ్‌ గుప్తా తెరకెక్కించిన 80ల నాటి కథతో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని