MEB: ఆ నమ్మకంతోనే థియేటర్లలోకి వస్తున్నాం

‘‘అఖిల్‌ ఒక సినిమా ఫలితం కన్నా.. దానికోసం సిద్ధమయ్యే ప్రక్రియని ఎంతో ప్రేమిస్తాడు. తనలోని ఆ లక్షణం నాకెంతో నచ్చుతుంద’’న్నారు కథానాయకుడు నాగచైతన్య. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో

Updated : 30 Aug 2022 15:56 IST

‘‘అఖిల్‌ ఒక సినిమా ఫలితం కన్నా.. దానికోసం సిద్ధమయ్యే ప్రక్రియని ఎంతో ప్రేమిస్తాడు. తనలోని ఆ లక్షణం నాకెంతో నచ్చుతుంద’’న్నారు కథానాయకుడు నాగచైతన్య. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్ర విడుదల ముందస్తు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించారు. బన్నీవాసు, వాసువర్మ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 15న రానుంది. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘భాస్కర్‌ మనుషుల మధ్య ఉండే అనుబంధాల్ని, భావోద్వేగాల్ని చాలా బాగా డీల్‌ చేస్తాడు. అఖిల్‌ కెరీర్‌ని స్టార్ట్‌ చేసి నాలుగేళ్లు అవుతోంది. రోజూ ఇంట్లో ఓ కొత్త అఖిల్‌ని చూస్తుంటా. ట్రైలర్‌ చూస్తుంటే ఓ వేడుకలా అనిపించింది. ఈ సమయంలో థియేటర్లలో అలాంటి ఓ వేడుకే కావాలి. అది ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. అఖిల్‌ మాట్లాడుతూ ‘‘గర్వంగా చెబుతున్నాం.. మేమందరం ఓ మంచి సినిమా తీశాం. భాస్కర్‌ సినిమాలు, కథలు నాకు చాలా ఇష్టం. ఆయన మెదడులో యుద్ధాలు జరుగుతుంటాయి. ఓ సీన్‌ని ఎలా తీయాలి అని ఎప్పుడూ తపన పడుతుంటాడు. పూజా హార్డ్‌ వర్క్‌ నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది. కొవిడ్‌ పరిస్థితుల తర్వాత థియేటర్లలో సినిమాలు ఆడతాయా? లేదా? అనుకుంటున్న సమయంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా మాకు ఓ నమ్మకాన్ని అందించింది. ఇప్పుడా నమ్మకాన్ని అందిపుచ్చుకునే మేము అక్టోబరు 15న థియేటర్లలోకి వస్తున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి. వంద శాతం ఆక్యుపెన్సీ వస్తుందని కోరుకుంటూ.. కచ్చితంగా గత వైభవాన్ని మళ్లీ చూస్తామని నమ్ముతున్నా. మనం సినిమాలు తీసేదే థియేటర్ల కోసం. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు రండి. నవ్వుల థెరపీని అనుభూతి చెందండి. ఇక కొవిడ్‌ని మర్చిపోండి’’ అన్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘అఖిల్‌ని తెలుగు ప్రేక్షకులందరి దగ్గరికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ సినిమా చేశా. కచ్చితంగా ఇందులో ఆయన్ని ఓ కొత్త కోణంలో.. ఫ్రెష్‌ యాంగిల్‌లో చూస్తారు. విభాగా పూజా తన నటనతో నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది. ఓ కోపం నుంచి ఈ కథ పుట్టింది. ఈలోకం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ను తయారు చేస్తోంది. అయితే వీళ్లలో ఉన్న ఓ చిన్న విషయం ఎవరూ ఎవరికి నేర్పించడం లేదు. అదేంటి? అన్న ఓ చిన్న ప్రయత్నమే ఈ చిత్రం. కచ్చితంగా అది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా’’ అన్నారు. ‘‘నాకెంతో ప్రత్యేకమైన చిత్రమిది. నాకోసం విభా లాంటి పాత్రను సృష్టించినందుకు దర్శకుడు భాస్కర్‌ సర్‌కు కృతజ్ఞతలు. ఇందులో నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉన్నాయి’’ అంది నాయిక పూజా హెగ్డే. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంతో నా కెరీర్‌లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలను అనిపించింది. అల్లు అరవింద్‌ సర్‌ సింగిల్‌ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే చేశారు. క్లైమాక్స్‌ చూస్తున్నప్పుడు కళ్లలో ఓ కన్నీటి జీర వచ్చింది. ఇదంతా భాస్కర్‌ క్లైమాక్స్‌ని తీర్చిదిద్దుకున్న విధానం.. సంభాషణల వల్లే సాధ్యమైంది’’ అన్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, దిల్‌రాజు, హరీశ్‌ శంకర్‌,  మారుతి, వాసు వర్మ, ఆమని, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని