సీతారామం.. అందమైన దృశ్య కావ్యం

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. అశ్వినీదత్‌ నిర్మాత. రష్మిక, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందించారు.

Published : 05 Jul 2022 01:52 IST

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. అశ్వినీదత్‌ నిర్మాత. రష్మిక, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘‘ఇంతందం దారి మళ్లిందా’’ అనే గీతాన్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దుల్కర్‌, మృణాల్‌పై రూపొందించిన ప్రేమ గీతమిది. దీనికి కృష్ణకాంత్‌ సాహిత్యమందించగా.. ఎస్పీ చరణ్‌ ఆలపించారు. ఈ కార్యక్రమంలో నటి మృణాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ పాట విన్న ప్రతిసారీ మనసుకు హాయిగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అమితంగా ప్రేమిస్తారు. చాలా గొప్ప కథతో రూపొందింది. ప్రతి ఫ్రేమ్‌ ఒక అందమైన పెయింటింగ్‌లా ఉంటుంది. దుల్కర్‌ లేకుంటే ఈ చిత్రం లేదు. తనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం’’ అంది. ‘‘దర్శకుడు హను రాఘవపూడి అచ్చమైన తెలుగు పాటలు రాయిస్తుంటారు. ఈ పాటని 1965 నేపథ్యం ప్రతిబింబించేలా స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాయమని చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం ఒక అందమైన దృశ్య కావ్యంలా ఉంటుంది’’ అన్నారు గీత రచయిత కృష్ణకాంత్‌. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో నాకెంతో ఇష్టమైన పాటిది. చాలా సవాల్‌తో కూడుకొని ఉంటుంది. దీన్ని కృష్ణకాంత్‌ అద్భుతంగా రాశారు. పాట విన్నాక వేటూరి గుర్తొచ్చారు. ఈ గీతాన్ని విశాల్‌ చాలా ఆర్గానిక్‌గా క్రియేట్‌ చేశారు. కానీ, రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో దుల్కర్‌, మృణాల్‌ చూడముచ్చటగా ఉంటారు’’ అన్నారు. ‘‘గొప్ప సంగీతాభిరుచి ఉన్న దర్శకుడు హను. సినిమాలోని ప్రతిపాట మనసుని హత్తుకునేలాగే ఉంటుంది’’ అన్నారు సంగీత  దర్శకుడు విశాల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని