Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పాటపై విమర్శలు.. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అంటూ రచయిత ఆగ్రహం..!

‘ఓ మై బేబీ’ పాటపై విమర్శలు చేసినవారిపై గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయాలు తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంటుందన్నారు.

Published : 14 Dec 2023 18:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) నుంచి విడుదలైన ‘ఓ మై బేబీ’ పాటను ఉద్దేశించి ట్రోల్‌ చేసిన నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర గీత రచయిత రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry). దురుద్దేశంతో టెక్నీషియన్స్‌ను టార్గెట్‌ చేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.

‘‘సోషల్‌మీడియాలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఏదైనా విషయంపై పూర్తి అవగాహన లేకుండానే కామెంట్‌, జడ్జ్‌ చేయొచ్చని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. చెడు ఉద్దేశాలతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. పాటల రచయిత, టెక్నీషియన్స్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఎవరో ఒకరు దీనిపై మాట్లాడాలి. ఎందుకంటే కొంతమంది నెటిజన్లు గీతలు దాటుతున్నారు. ప్రతివాడూ మాట్లాడేవాడే. రాయి విసిరే వాడే. అభిప్రాయం తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. నిడివి తప్ప నిన్న విడుదల చేసిన పాటకు ఏం తక్కువైంది. మీకన్నా ఎక్కువ ప్రేమే ఉంది మాకు. అదే లేకపోతే ఈ పనిని మేము గొప్పగా చేయలేం. ఆ విషయాన్ని గ్రహించి కాస్త జాగ్రత్తగా మాట్లాడండి’’ అని రామజోగయ్య శాస్త్రి ట్వీట్స్‌ చేశారు.

‘ఇతరుల జీవితం గురించి మీకేం తెలుసు..?’.. ఆగ్రహం వ్యక్తం చేసిన కరణ్‌ జోహర్‌

‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రచార చిత్రాలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఓ మై బేబీ’ పాట విడుదలైంది. 2.59 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించారు. ఇప్పటివరకూ దాదాపు 27 లక్షల మంది ఈ పాటను వీక్షించారు. ఈ పాట తమకెంతో నచ్చిందని పలువురు నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా కొంతమంది దీనిపై నెగెటివ్‌గా కామెంట్స్‌ చేయగా.. రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని