prashanthi harathi: నటిగా రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టా

నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి.  వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె.

Updated : 27 Mar 2024 11:40 IST

నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి.  వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె. ‘ఇంద్ర’ సినిమాలో ముంతాజ్‌గా,  ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో సునీల్‌ భార్యగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రశాంతి హారతి. ‘ఫిబ్రవరి 14 నెక్లెస్‌ రోడ్‌’, ‘రూపాయి’తోపాటు పలు చిత్రాల్లోనూ,  ధారావాహికల్లోనూ నటించారు. కూచిపూడి నృత్య కళాకారిణి అయిన ప్రశాంతి... పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే కూచిపూడి డ్యాన్స్‌ స్కూల్స్‌ని నిర్వహిస్తున్నారు. నటిగా రోండో ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టానంటూ ఆమె మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘చిన్నప్పుడు నృత్యమే నాకు ప్రపంచం. నృత్య ప్రదర్శనలు, ఫొటో మోడలింగ్‌ వల్ల సినిమా రంగం నుంచి అవకాశాలొచ్చాయి. అలా అనుకోకుండానే చిత్ర పరిశ్రమకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నా. ఇంతలో పెళ్లి నా నట ప్రయాణాన్ని మలుపు తిప్పింది.

సినీ రంగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం బాధగా అనిపించింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని చూసుకుంటూనే ఆమెరికాలో నృత్య పాఠశాలల్ని నిర్వహించా. నటనపై నాకున్న మక్కువని గమనించిన నా భర్త, నా పిల్లలు మళ్లీ సినిమా కెరీర్‌ని పునః ప్రారంభించాలని ప్రోత్సహించారు. మా అమ్మాయి తాన్య హారతితో కలిసి వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో తెలుగింటి సంస్కృతి పేరుతో ఓ వీడియో చేశా. దర్శకుడు కె.రాఘవేంద్రరావు యూ ట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. గతంతో పోలిస్తే చిత్ర సీమలో చాలా మార్పులొచ్చాయి. సినిమాలతోపాటు, వెబ్‌ సిరీస్‌లు, టెలివిజన్‌ షోలు ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. కథలో ప్రాధాన్యమున్న పాత్రలొస్తే ఎక్కడి నుంచి అవకాశాలొచ్చినా చేయడానికి సిద్ధమే. గతంలో కె.విశ్వనాథ్‌ సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందుతూ మన సంప్రదాయ కళల్ని ముందు తరాలకి చేర్చాం. అలా స్ఫూర్తినిచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇప్పుడు కూడా రావల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు ప్రశాంతి హారతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని