Mansion 24: హారర్‌ సినిమా.. ఆ సీన్స్‌ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యేది

ఓంకార్‌ దర్శకత్వం వహించిన రీసెంట్‌ హారర్‌ ప్రాజెక్ట్‌ ‘మాన్షన్‌ 24’ (mansion 24). ఈ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.

Published : 16 Oct 2023 18:40 IST

హైదరాబాద్‌: వరలక్ష్మి శరత్‌కుమార్‌, సత్యరాజ్‌, అవికాగోర్‌, నందు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ సిరీస్‌ ‘మాన్షన్‌ 24’ (Mansion 24). ఓంకార్‌ దర్శకుడు. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి ప్రేక్షకులకు ఇది అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో టీమ్‌ పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏదైనా ప్రాజెక్ట్‌కు అంగీకరించేటప్పుడు ఏ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటారు?

వరలక్ష్మి: నాలోని నటిని ఛాలెంజ్‌ చేసే పాత్రలను నేను ఎక్కువగా ఎంచుకుంటా. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లేడీ విలన్‌ పాత్రలు పోషిస్తున్నా. ఈ సిరీస్‌లో నాది సాధారణమైన అమ్మాయి పాత్ర మాత్రమే. ఒక తండ్రిని వెతుక్కుంటూ మాన్షన్‌కు వెళ్లిన ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే ఆసక్తికర అంశాలతో దీనిని తీర్చిదిద్దారు. ఈ పాత్ర నాకెంతో నచ్చింది అందుకే నటించా.

‘మాన్షన్‌ 24’.. ఈ నంబర్‌కు ఏదైనా మీనింగ్‌ ఉందా? ఆ నంబర్‌ మాత్రమే ఎందుకు పెట్టారు?

ఓంకార్‌: వందశాతం మీనింగ్‌ ఉంది. సిరీస్‌ చూస్తే అది మీకు తెలుస్తుంది. సాధారణంగా నేను ఎలాంటి ప్రాజెక్ట్‌ చేసిన దాని టైటిల్‌ మొదట నా తమ్ముడు అశ్విన్‌కు పంపుతా. తెలిసిన ఆస్ట్రాలజిస్ట్‌ను కలిసి.. వాళ్లు చెప్పిన విధంగా టైటిల్‌ ఫైనల్‌ చేస్తాం. ఈ చిత్రానికి కూడా మొదట ఎన్నో రకాల టైటిల్స్‌ అనుకున్నాం. ఫైనల్‌గా ‘మాన్షన్‌ 24’ ఫిక్స్‌ చేశాం.

‘మాన్షన్‌ 24’ను ఓటీటీలోనే ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారు?

ఓంకార్‌: భవిష్యత్తులో థియేటర్‌కు పోటీగా ఓటీటీ రూల్‌ చేయనుంది. ఇప్పటివరకూ నేను పలు టీవీల్లో షోలు, సినిమాలూ చేశా. ఓటీటీలోనూ ట్రై చేయాలని అనుకున్నా. అందుకోసమే ‘మాన్షన్‌ 24’ను చేయడం జరిగింది. సినిమాకు ఏమాత్రం తగ్గకుండా భారీ తారాగణాన్ని ఇందులో క్యాస్టింగ్‌ చేసుకున్నాం. అవుట్‌పుట్‌ కూడా అద్భుతంగా వచ్చింది.

రాజీవ్‌ కనకాల రోల్‌ ఈ సిరీస్‌లో బతికే ఉంటుందా?

ఓంకార్‌: అది మీరు చూడాలి. అన్నీ నేనే చెప్పేస్తే ఎలా..?

కొరియన్‌లో వచ్చిన ఘోస్ట్ మాన్షన్‌ను స్ఫూర్తిగా తీసుకుని దీనిని తీర్చిదిద్దారనుకోవచ్చా..?

ఓంకార్‌: దానికి దీనికి సంబంధం లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు నా స్టైల్‌లో దీనిని తెరకెక్కించా.

ఈ సిరీస్‌లో అమ్మ పాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏమిటి?

అర్చన: ‘కేజీయఫ్‌’ తర్వాత కేవలం తల్లి పాత్రలు మాత్రమే నాకు వచ్చాయి. అలా, ఎన్నో అవకాశాలు వదులుకున్నా. తెలుగు పరిశ్రమ నుంచీ ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఇది నాకు సూట్‌ అవుతుందని నమ్మా. నేనొక భరతనాట్యం డ్యాన్సర్‌ని. ఇందులోని నా పాత్ర కూడా భరతనాట్యం డ్యాన్సరే కావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలుగులో ఎంట్రీకి ఈ ప్రాజెక్ట్‌ నాకెంతో సాయం చేస్తుందని భావిస్తున్నా

సినిమా షూట్‌ తర్వాత మీరు భయపడిన సందర్భాలు ఉన్నాయా?

వరలక్ష్మి: నేను దెయ్యాలు, భగవంతుడిని నమ్ముతా. షూట్‌ ఉన్నప్పుడు మాత్రమే నా రోల్‌ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఒక్కసారి షాట్‌ పూర్తయ్యాక ఆ సీన్‌ గురించి అస్సలు ఆలోచించను.

వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏమిటి?

వరలక్ష్మి: థియేటర్‌ లేదా ఓటీటీ ఇలా విడదీసి చూడటం నాకు తెలియదు. ఒక నటిగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే నా ప్రధాన లక్ష్యం. అది ఏ మాధ్యమం అయినా సరే.

ఈ ప్రాజెక్ట్‌లోకి మీ తమ్ముడు అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదు?

ఓంకార్‌: నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌లో నా తమ్ముడు తప్పక ఉంటాడు. ‘మాన్షన్‌ 24’లోనూ వాడు ఉన్నాడు. అయితే ఈ సీజన్‌లో కనిపించకపోవచ్చు. సెకండ్‌ సీజన్‌ వాడితోనే మొదలు కానుంది.

హారర్‌ సినిమాలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి?

అవికాగోర్‌: నాకు హారర్‌ సినిమాలంటే ఎంతో ఇష్టం. భయపడటం లేదా భయపెట్టడం రెండూ ఇష్టమే. ఓటీటీతోపాటు సినిమాల్లోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నా.

షూటింగ్‌ అనుభవాలు పంచుకోవచ్చు?

నందు: ఇందులో ఒక శవ పేటిక ఉంటుంది. దానిని బేస్‌ చేసుకుని సీన్స్‌ చేసిన ప్రతి సారీ ఏదో ఒకరకమైన అడ్డంకి తలెత్తేది. మూడు రోజులు షూట్‌ చేశా. నాలుగో రోజు నా కాలికి దెబ్బ తగిలింది. మూడు నెలలు షూట్‌ ఆపేశారు.

వేరే జానర్‌ సినిమాలు ఎప్పుడు చేస్తారు?

ఓంకార్‌: విఠలాచార్య సినిమాలంటే చిన్నప్పుడు నాకెంతో ఇష్టం. ఎక్కువగా ఆ చిత్రాలే చూసేవాడిని. ఆ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అందుకే నా నుంచి ఎక్కువగా హారర్‌ సినిమాలు వస్తున్నాయి. త్వరలోనే వేరే జానర్‌ సినిమాలు చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని