Defamation Case: బాలీవుడ్‌ నటి కంగనకు ముంబై కోర్టు వార్నింగ్‌ 

పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ముంబై కోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. ఇదే ఆఖరి అవకాశమని.. తదుపరి....

Published : 27 Jul 2021 21:55 IST

ముంబయి: పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ముంబై కోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. ఇదే ఆఖరి అవకాశమని.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకపోతే బుయిలబుల్‌ వారెంట్‌ జారీచేస్తామని అంధేరిలోని మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం మెజిస్ట్రేట్‌ హెచ్చరించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం కేసులో తన పరువుకు నష్టంకలిగించేలా కంగన వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఆమెపై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై ముంబయిలోని అంధేరి మెట్రోపాలిటన్‌ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు కంగన వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. విదేశాల్లో ఉన్నందున రాలేకపోయారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు నుంచి  మినహాయింపు కోరగా.. జావేద్‌ అక్తర్‌ తరఫు న్యాయవాది జయ్‌ భరద్వాజ్‌ అభ్యంతరం తెలిపారు. ఆమెకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఈరోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయాలన్న జావేద్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. అయితే, ఈ కేసు తదుపరి విచారణకు హాజరుకావడంలో ఆమె విఫలమైతే మాత్రం బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 1కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని