Nani: ‘జెర్సీ’ ఫెయిల్యూర్‌ అంటూ విలేకరి ప్రశ్న.. నాని అసహనం

‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 15 Oct 2023 15:48 IST

హైదరాబాద్‌: నాని (Nani) ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). శౌర్యువ్‌ దర్శకుడు. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్‌తో సిద్ధమైన ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా సాగింది. ఇందులో నాని పాల్గొన్నారు. తన గత చిత్రాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట అనుకున్న విధంగా డిసెంబర్‌ 21 లేదా 22వ తేదీన కాకుండా ‘హాయ్‌ నాన్న’ను ముందుగానే విడుదల చేయడానికి కారణాన్ని తెలియజేశారు.

‘‘పెళ్లి కాకముందు నుంచి ఒక ఆడపిల్లకు తండ్రిని కావాలని ఎన్నో కలలు కన్నాను. ‘హాయ్‌ నాన్న’తో నా కలలో జీవించే అవకాశం దొరికింది. ఈ సినిమాతో నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిననే అనుభూతిని పొందాను. ఇదొక అందమైన ఫీలింగ్‌. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. ఇలాంటి అందమైన స్క్రిప్ట్‌లో నటించే అవకాశం రావడం నిజంగానే అదృష్టం. టీమ్‌ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అభిమానులు, సినీ ప్రియుల ఊహలకు మించి ఈ సినిమా ఉంటుంది. ఒక సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయడం అంత సులభం కాదు. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. టీమ్‌ మొత్తం చర్చించుకున్నాక డిసెంబర్‌ 7న రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్ చేశాం. నా కెరీర్‌లో ఇదొక స్పెషల్‌ ఫిల్మ్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నా’’ అని నాని అన్నారు. అనంతరం ఆయన విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారిలా..

ఇలాంటి కథతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. మీ సినిమా ఏ విధంగా భిన్నంగా ఉండనుంది?

నాని: ట్రైలర్‌, ఇతర ప్రమోషనల్‌ వీడియోలు విడుదలయ్యాక ఈ సినిమాలోని ప్రత్యేకత ఏమిటనేది మీకు తప్పకుండా తెలుస్తుంది. రిలీజ్‌ దగ్గరకు వచ్చేసరికి ‘హాయ్‌ నాన్న’ కథ పట్ల మీకొక క్లారిటీ వస్తుంది.

కమర్షియల్‌ రన్‌కు ఉపయోగపడే కంటెంట్‌ ఇందులో ఉందని మీరు నమ్ముతున్నారా?

నాని: దాదాపు ఐదారేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్‌ సినిమా అంటే యాక్షన్‌ అనేది ప్రామాణికంగా మారింది. నా దృష్టిలో అన్ని వయసుల వారిని అలరించేదే కమర్షియల్‌ సినిమా. కాబట్టి, మా సినిమా మోస్ట్‌ కమర్షియల్‌ చిత్రం.

ప్రతి సినిమాలో మీరు ఏదో ఒక సాహసం చేస్తుంటారు? అది మీకు కష్టంగా అనిపించడం లేదా?

నాని: నచ్చని పని చేసినప్పుడే కష్టంగా అనిపిస్తుంది. నచ్చింది చేయడం సులభం. నచ్చిన సినిమాలు చేస్తున్నా.

మీరు ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ వంటి మంచి సినిమాలు చేసినప్పటికీ.. నిర్మాతలకు అనుకున్నంత డబ్బులు రావడం లేదని టాక్‌?

నాని: ఈ మాట ఏ నిర్మాతలు చెప్పారో చెప్పండి. నా వద్ద నంబర్స్‌ ఉన్నాయి. గత చిత్రాల కలెక్షన్స్‌ గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదనుకుంటున్నా. థియేరిటికల్‌, నాన్‌ థియేరిటికల్‌, రీమేక్‌.. ఇలా అన్నివిధాలుగా ఆ సినిమా మంచిగానే వసూళ్లు అందుకుంది. ‘జెర్సీ’ని ఉదాహరణగా చూపించడం తప్పు. కావాలంటే.. ‘అంటే సుందారానికీ’ని ఉదాహరణగా చెప్పొచ్చు. తెలిసీ తెలియని వాళ్లు సోషల్‌ మీడియాలో ఇలాంటి మాటలు అనొచ్చు కానీ.. అన్నీ తెలిసిన మీడియా సరైన రీజనింగ్‌తో సరిగ్గా అడ్రస్‌ చేయాలి. మీరు అంటున్న మాటలు.. మీకు నిజం కాదని తెలిసినప్పుడు ఆపేయడం అనేది కూడా మీ బాధ్యతే.

ఈ విషయంపై ‘జెర్సీ’ నిర్మాత నాగవంశీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నిర్మించిన లాభదాయకమైన చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఆ సినిమా మాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎనలేని గౌరవాన్ని అందించింది. క్రియేటివ్‌, ఆర్థిక పరంగా ఒక నిర్మాతగా నేను ఈ సినిమా విషయంలో ఆనందంగా ఉన్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

ఈ సినిమా మీ కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు?

నాని: సినిమా విషయంలో నేను పెద్దగా లెక్కలు వేసుకోను. ఏదైనా కథ మనసుకు నచ్చితే తప్పకుండా యాక్ట్‌ చేస్తా. ‘అష్టాచమ్మా’ నుంచి ఇప్పటి వరకూ నటించిన ప్రతి సినిమా అలాంటిదే.

ఈ వయసులో మీరు నాన్న పాత్ర పోషించడం ఓకేనా?

నాని: రోజులు మారుతున్నాయి. చుట్టూ ఉండే పరిసరాలు, ఉపయోగించే పరికరాలు అన్నీ మారుతున్నాయి. పద్ధతులు కూడా మారాలనుకుంటా. ఎప్పటికప్పుడు మారుతుండేదే సినిమా. ప్రేక్షకులు కూడా స్పీడ్‌గా అప్‌డేట్‌ అవుతున్నారు. వాళ్లను క్యాచ్‌ చేయలేకపోతే కష్టం.

జున్నూతో మీ రిలేషన్‌ ఎలా ఉంటుంది?  

నాని:  మా అబ్బాయి జున్నూతో నేనొక స్నేహితుడిలా ఉంటా. ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు ‘హాయ్‌ నాన్న.. పేరు నేనే పెట్టా కదా’ అని జున్నూ అడిగాడు. ‘హాయ్‌ నాన్న’ అనే పదం పూర్తిగా వాడి సొంతం. వాడి ఆనందం కోసం ‘అవును నువ్వే పెట్టావు’ అని చెప్పేవాడిని. నేను నటించిన ‘జెర్సీ’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలు చూసి భవిష్యత్తులో వాడు గర్వపడతాడని నమ్ముతున్నా.

పాన్‌ ఇండియా బాటలో పడి తెలుగు నటీనటులను తీసుకోవడం లేదనే టాక్‌ ఉంది? ఈ సినిమాలో మీరు ఒక్కరే తెలుగు నటుడు ఉన్నారు. మిగతా వాళ్లందరూ వేరే భాషల నటులు ఉన్నారు ఎందుకలా..?

నాని: పాన్‌ ఇండియా కాకుండా నటీనటులందరూ తెలుగు వాళ్లు మాత్రమే కనిపించిన సినిమా ఏదైనా ఉంటే చెప్పండి. పాన్‌ ఇండియా అనే కాన్సెప్ట్‌ కోసమే వేరే భాష నటులను ఎంచుకున్నామనడం నిజం కాదు. ఈ సినిమాలో తెలుగు, హిందీ, తమిళ నటీనటులు ఉన్నారు. ఆయా పాత్రలకు వాళ్లు సూట్‌ అవుతారని తీసుకున్నాం. మా ఉద్దేశం కేవలం ఒక మంచి చిత్రాన్ని అందించాలని మాత్రమే. అలాగే, ఇదొక అచ్చమైన తెలుగు సినిమా.

ఈ సినిమాలో హీరోయిన్‌ మిమ్మల్ని ‘హాయ్‌ నాన్న’ అని ఎందుకు పిలుస్తుంది? అలాగే డిసెంబర్‌ 22 నుంచి రిలీజ్‌ డేట్‌ను మార్చడానికి కారణం ఏమిటి

నాని: ఈ సినిమాలో నా కుమార్తె నన్ను ‘హాయ్‌ నాన్న’ అనే పిలుస్తుంది. అందుకే హీరోయిన్‌ కూడా అలాగే పిలుస్తుంది. మా చిత్రాన్ని మొదట డిసెంబర్‌ 21 లేదా 22 తేదీల్లో విడుదల చేయాలనుకున్నాం. అయితే, ఒక కుటుంబంలో ఒకే తేదీలో అన్నాదమ్ముల ఫంక్షన్స్‌ ఉంటే.. అన్నయ్య (సలార్‌) కోసం తమ్ముడు డేట్‌ మార్చుకుంటాడు. దాని వల్ల ఎలాంటి సమస్య లేదు. ఒక మంచి లవ్‌ స్టోరీ, యాక్షన్‌ కథలతో డిసెంబర్‌ నెల కళ కళలాడుతుంటే అంతకు మించి ఏం కావాలి.

‘సైంధవ్‌’ కూడా ఇలాంటి కథ కదా?

నాని: శైలేష్‌ కొలను సాధారణంగా తన వద్ద ఉన్న కథలను నాతో షేర్‌ చేసుకుంటాడు. ‘సైంధవ్‌’ అద్భుతమైన చిత్రం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది.

‘దసరా’ కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ, సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. ఆ సినిమా రిజెల్ట్‌ వల్ల ఏదైనా గందరగోళానికి గురయ్యారా?

నాని: ‘పుష్ప’ లేదా ‘కేజీయఫ్‌’ లాంటి విజయాన్ని ‘దసరా’ నుంచి నేను కోరుకోలేదు. నేను నటించిన ప్రతి చిత్రానికి హిందీలో ప్రేక్షకులు పెరుగుతూ ఉండాలని అనుకున్నా. ఆ విధంగా చూసుకుంటే ‘దసరా’కు హిందీలో మంచి ఆదరణ లభించింది.

మీరు నటించిన ప్రతి సినిమాలో లిప్‌లాక్‌ సీన్స్‌ ఉంటున్నాయి ఎందుకు అలా?

నాని: నేను నటించిన సినిమాలన్నింటిలో అలా లేవు. సీన్‌కు అవసరం అయితే దర్శకుడు తప్పకుండా ఆ సీన్‌ కావాలని చెబితే చేస్తానంతే. ఇలాంటి సీన్స్‌ తర్వాత మా ఇంట్లో గొడవలు జరుగుతాయి (నవ్వులు).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని