Ori Devuda: అదే ‘ఓరి దేవుడా’ ప్రత్యేకత!

‘‘కథతోపాటు... నటుల బలాల్ని ఆధారంగా చేసుకుని పాత్రల్ని కూడా కొత్తగా డిజైన్‌ చేశారు దర్శకుడు. మాతృక చూసినా సరే, మరో కొత్త తెలుగు సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు పంచుతాం’’ అన్నారు మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌.

Updated : 19 Oct 2022 10:54 IST

‘‘కథతోపాటు... నటుల బలాల్ని ఆధారంగా చేసుకుని పాత్రల్ని కూడా కొత్తగా డిజైన్‌ చేశారు దర్శకుడు. మాతృక చూసినా సరే, మరో కొత్త తెలుగు సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు పంచుతాం’’ అన్నారు మిథిలా పాల్కర్ (Mithila Palkar), ఆశాభట్‌. ‘ఓరి దేవుడా’ (Ori Devuda) చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కథానాయికలు వీళ్లు. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా, అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మిథిలా, ఆశాభట్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

మిథిలా పాల్కర్‌:  ‘‘సినిమాలో అను అనే యువతిగా కనిపిస్తా. నాకు అలవాటైన పాత్రే. తెలుగులో నాకు ఇదే తొలి చిత్రం. భాష కొత్త కాబట్టి, ఇక్కడ నాకు అలవాటైన పాత్ర దొరకడంతో చాలా మేలయ్యింది. భాషపైనా, భావోద్వేగాలపైనా దృష్టిపెట్టా. స్నేహం, ప్రేమ, పెళ్లి విషయంలో రెండో అవకాశం తదితర విషయాల్ని వినోదాత్మకంగా చర్చించే ఓ మంచి కథ ఇది. దర్శకుడు అశ్వథ్‌ నాతో ఆర్నెళ్లపాటు టచ్‌లో ఉంటూ ఈ కథ చెప్పారు. ఆయన కథ చెప్పాక తమిళంలో వచ్చిన ‘ఓ మై కడవులే’ని చూశా. చాలా నచ్చింది. కానీ దర్శకుడు ఈ సినిమాని పక్కా తెలుగు సినిమాలా తీర్చిదిద్దారు. నా నట ప్రయాణం ఎక్కువగా అంతర్జాలంతోనే ముడిపడింది. యూ ట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వేదికల్లో వెబ్‌ సినిమాలు ఎక్కువగా చేసి గుర్తింపు పొందా. ‘కట్టి బట్టి’తోపాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. మరోసారి పెద్ద తెరతో ప్రేక్షకుల్ని పలకరిస్తుండడం ఆనందంగా, ఆత్రుతగా ఉంది. వెంకటేష్‌ సర్‌ ఇందులో కీలక పాత్ర చేశారు. కానీ ఆయనతో నటించే అవకాశమే నాకు దక్కలేదు. కథానాయకుడు విష్వక్‌సేన్‌, నిర్మాణ సంస్థ పీవీపీతో ప్రయాణం గుర్తుండిపోతుంది’’.

ఆశాభట్‌: ‘‘నేను కన్నడ అమ్మాయిని. భద్రావతిలో పుట్టి పెరిగాను. ఇందులో మీరా అనే యువతిగా కనిపిస్తా. సహాయ దర్శకురాలి పాత్ర నాది. ఈ ప్రాజెక్ట్‌లోకి విష్వక్‌, మిథిలా తర్వాత నేను వచ్చా. కన్నడ చిత్రం ‘రాబర్ట్‌’ తర్వాత మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నప్పుడు దర్శకుడు అశ్వథ్‌, నిర్మాత పీవీపీ నాకు ఈ కథ చెప్పారు. వెంటనే ఒప్పుకున్నా. ‘ఓ మై కడవులే’ నేను చూశా. కానీ ఏ ఒక్క పాత్ర, సన్నివేశం కూడా ఒకేలా అనిపించదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. నా బలం డ్యాన్స్‌. దాన్ని హైలెట్‌ చేస్తూ దర్శకుడు నా పాత్రని డిజైన్‌ చేశారు. నా ఒక్క పాత్రే కాదు, అన్ని విషయాలపైనా మరో కొత్త సినిమా చేస్తున్నట్టుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో పూరి జగన్నాథ్‌ ఓ పాత్రలో కనిపిస్తారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. కన్నడ అమ్మాయినే కాబట్టి తెలుగు కష్టం అనిపించలేదు. మిథిలా, నేను సెట్లో ఎప్పుడు కలిసినా ఆడుతూపాడుతూ గడిపేవాళ్లం. మా ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. తదుపరి చేయనున్న సినిమా వివరాల్ని ఈ సినిమా విడుదల తర్వాత ప్రకటిస్తా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని