Balagam: అలా జరగకపోతే నాకు మెసేజ్‌ పెట్టండి: పరుచూరి గోపాలకృష్ణ

ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌ జంటగా నటించిన కుటుంబకథా చిత్రం ‘బలగం’ (Balagam). తాజాగా ఈసినిమాపై రివ్యూ చెప్పారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ

Published : 09 Apr 2023 16:16 IST

హైదరాబాద్‌: కొత్త సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సినిమా తెరకెక్కించడంలో యువతరానికి సలహాలు, సూచనలు ఇస్తుంటారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). తాజాగా ఆయన ‘బలగం’ (Balagam)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమా చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. సినిమా చూసిన వెంటనే చిత్ర దర్శకుడు వేణుతోపాటు పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ను ఫోన్‌ చేసి అభినందించానన్నారు. భావోద్వేగాలతో కూడుకున్న ఈ సినిమా చూసి ప్రేక్షకులు తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారన్నారు.

‘‘ఒక సినిమాకు ఏది బలమో అది ‘బలగం’లో ఉంది. ఇదొక వినూత్న ప్రయోగం. దీనిని చేస్తున్నప్పుడు ఇది ఇంతటి విజయాన్ని అందుకుంటుందని దిల్‌రాజు కూడా అనుకుని ఉండరు. ఖర్చు పెట్టిన దాని కంటే పదిరెట్లు ఎక్కువ వసూళ్లు చేసిందీ సినిమా. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదని.. కథను నమ్ముకుంటే చాలని ఇది నిరూపించింది. చిన్న బడ్జెట్‌ లేదా పెద్ద బడ్జెట్‌ అనేది విషయం కాదు. పెద్ద బడ్జెట్‌ సినిమాతో సమానంగా ఇది ఆదరణ అందుకుంది.

వేణుని ‘జబర్దస్త్‌’ కమెడియన్‌గా చూశాను. ఇతడిలో గొప్ప రచయిత, ఇంత సృజనాత్మకత ఉందని నేనస్సలు ఊహించలేదు. ఎందుకంటే.. కామ్‌గా కామెడీ చేస్తోన్న కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా చేయగలడనేది ఊహకు అందని అంశం. ఇతడు చేసిన మాయ ఏమిటంటే.. ముందు నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమా నడిపించవచ్చు. కానీ, ఇతడు అలా చేయలేదు. నవ్వించాడు. కవ్వించాడు. చివరకు భావోద్వేగానికి గురి చేశాడు. ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా అరుదు. అలాంటి నేను ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు సాధారణంగా మనం కన్నీళ్లు పెడతాం. కానీ, ఇందులో కుటుంబం కలుస్తుంటే భావోద్వేగం చెందుతాం. ఇది ఒక అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్‌ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారు.

ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి, పాయింట్‌ను చూపించడానికి ఎవరూ సాహసం చేయరు. చావు, కర్మ కార్యక్రమాలు, ఏడుపులు.. ఇలాంటి వాటిపై సినిమా చేస్తే చూస్తారా? అనే భయం ఉంటుంది. అలాంటి భయాలేమీ లేకుండా వేణు అద్భుతంగా తెరకెక్కించాడు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతే పైన ఉన్నవారి ఆత్మ ఘోషిస్తోందనే విషయాన్ని గొప్పగా చెప్పిన సినిమా ఇది. కళ్లు తడవకుండా, ఒళ్లు గగుర్పాటుకు గురికాకుండా ఒక్క ప్రేక్షకుడు కూడా థియేటర్‌ నుంచి బయటకు రాడు. కాబట్టి, ఈ చిత్రాన్ని ఇప్పటికీ చూడకపోతే చూడండి. చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్‌ పెట్టండి’’ అని పరుచూరి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు