Salaar: ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్‌ సెల్యూట్‌..

మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  (Prithviraj Sukumaran) ‘సలార్‌’లో విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 16 Dec 2023 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’. డిసెంబర్‌ 22న విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘సలార్‌’లో ప్రభాస్‌ దేవా పాత్రలో కనిపించనున్నాడు. నేను వరదరాజ మన్నార్‌గా కనిపిస్తా. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్‌ చూడలేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్‌ అవుతుందని మా అందరికీ పూర్తి నమ్మకముంది. ఇక ప్రభాస్‌ను ఎవరైనా  ఇష్టపడతారు. నాకు చాలా తక్కువ మంది స్నేహితులున్నారు. కానీ, నేను తరచూ సంభాషించే వ్యక్తుల్లో  ప్రభాస్‌ ఒకరు. సెట్‌లో ఉన్న అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. అందరి కోసం భోజనం తెప్పిస్తాడు. తన చుట్టూ ఉండేవాళ్లు ఆనందంగా ఉండేలా చూస్తాడు. ఆయన అభిమానులు డార్లింగ్‌ అని ఎందుకంటారో ఈ షూటింగ్‌ సమయంలోనే నాకు అర్థమైంది’’ అని చెప్పారు.

అలా చేసినందుకే హిట్‌ అయింది: ‘మ్యాడ్‌’పై పరుచూరి విశ్లేషణ

ఇక ‘సలార్‌’ గురించి మాట్లాడుతూ..‘‘సలార్’తో నా కల నెరవేరింది. ఇప్పటి వరకు టీజర్‌, ట్రైలర్‌లో చూసింది చాలా తక్కువ. కేవలం యాక్షన్‌ మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న కథ ఇది. థియేటర్‌కు వచ్చిన వారంతా మంచి సినిమా చూశామన్న భావనతో బయటకు వస్తారు. ‘సలార్’ రెండో భాగం లీడ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇక ఈ సినిమా వచ్చే వారమే విడుదలకు సిద్ధం కాగా.. మొదటి టికెట్‌ను దర్శకధీరుడు రాజమౌళి కొనుగోలు చేయడం విశేషం.

హెలికాప్టర్లతో సెల్యూట్‌..

ఇక ఒకవైపు చిత్రబృందం ప్రచారం జోరు పెంచగా.. మరోవైపు ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో ఈ సినిమాపై అభిమానాన్ని చాటుకున్నారు. కెనడాలోని ప్రభాస్‌ అభిమానులు ఆరు హెలికాఫ్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్‌ సెల్యూట్‌ చేశారు. సలార్‌ లుక్‌కు సంబంధించిన భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసి దాని పైన ఒకేసారి ఆరు హెలికాప్టర్లు గాల్లో ఎగురుతూ సెల్యూట్ చేస్తున్నట్లు వీడియో చేశారు. దాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ షేర్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని