Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్‌

ప్రేక్షకులు, అభిమానులు చూపించే ప్రేమలోనే దేవుణ్ని చూస్తున్నానన్నారు రాఘవ లారెన్స్‌. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Published : 25 Sep 2023 02:03 IST

హైదరాబాద్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). పి. వాసు దర్శకత్వం వహించారు. రజనీకాంత్‌ హిట్‌ చిత్రం ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.

మహేశ్‌ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్‌

ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ.. ‘‘రెబల్‌’ తర్వాత తెలుగులో మరో సినిమాను డైరెక్ట్‌ చేయడం కుదర్లేదు. ‘చంద్రముఖి 2’ ద్వారా మిమ్మల్ని (ప్రేక్షకులు, అభిమానులు) కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్‌ కొనుక్కుని మరీ మమ్మల్ని చూస్తున్నారు. ఏం ఆశించకుండా మీరు మాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు. ఈ ప్రేమ గురించి ఏమని చెప్పగలం? మీ ప్రేమలోనే దేవుణ్ని చూస్తున్నా. నా కొరియోగ్రఫీలో డ్యాన్స్‌ చేసిన హీరోలందరి ఫ్యాన్స్‌ నాకు అభిమానులు. నాకు అవకాశం ఇచ్చిన హీరోలందరికీ ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నా’’

‘‘చంద్రముఖి 2’ విషయంలో ముందుగా రజనీకాంత్‌కు ధన్యవాదాలు చెబుతున్నా. ఆయన నటించిన సినిమా సీక్వెల్‌లో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు పి.వాసు కథ చెప్పగానే రజనీకాంత్‌కు ఫోన్‌ చేశాను. ‘అన్నయ్యా.. చంద్రముఖి- 2 సినిమా చేస్తున్నా’ అని చెప్పగానే ఆయన ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆయన లేకపోతే నేనీ వేదికపై ఉండేవాణ్ని కాదు. ఇంతమంది అభిమానం సొంతం చేసుకున్నానంటే చిరంజీవి మరో కారణం. నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోను. ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే ఎం.ఎం. కీరవాణికి ‘ఆస్కార్‌’ అవార్డు వచ్చింది. మేమంతా ఎంతో సంతోషించాం. ఈ సినిమా కూడా ఆస్కార్‌ స్థాయికి చేరుకోవాలని దేవుణ్ని కోరుకుంటున్నా. కంగనా రనౌత్‌తో మాట్లాడేందుకు కొన్ని రోజులు భయపడినా.. తర్వాత మేం క్లోజ్‌ అయ్యాం’’ అని అన్నారు. ఈ వేడుకలో కంగన, కీరవాణి, మహిమా నంబియార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని