Renu Desai: ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. నాకు ఈ అవకాశం వచ్చింది: రేణూ దేశాయ్‌

‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా రేణూ దేశాయ్‌ (Renu Desai) తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. హేమలత లవణం పాత్రలో నటించడంపై స్పందించారు.

Updated : 13 Oct 2023 17:20 IST

హైదరాబాద్‌: 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా వంశీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్‌ (Renu Desai) ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. ఇలాంటి పాత్రలో నటించడంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు స్పదించారు.

‘‘కథ, దర్శక - నిర్మాతల వల్లే నేను ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నా. హేమలత లవణం పాత్రలో నటించడానికి మొదట నేనెంతో భయపడ్డా. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేయగలనా? లేదా? అనుకున్నా. వంశీ, టీమ్‌ సపోర్ట్‌ చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఏదో జన్మలో చేసిన పుణ్యఫలం వల్లే ఈ పాత్ర పోషించే అవకాశం దక్కింది. నా పోస్టర్‌ చూసిన తర్వాత అకీరా ఎంతో ఆనందించాడు. ‘చాలామంది నటీమణులు వాళ్ల వయసుకు తగ్గ పాత్రల్లో నటించడానికి ఆసక్తి కనబరచడం లేదు. స్క్రీన్‌పై యంగ్‌గా కనిపించాలనుకుంటున్నారు. కానీ, నువ్వు నీ వయసుకు తగ్గ పాత్ర చేశావు. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నా’ అని ఆద్య చెప్పింది. నా రోల్‌ పట్ల వాళ్లు సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించింది’’

‘‘హేమలత లవణం పాత్ర నాతో ఎంతో మార్పు తెచ్చింది. చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో ఉండకూడదనేది నా లక్ష్యం. అందుకోసం శ్రమించాలనుకుంటున్నా. ఇక, రవితేజతో కలిసి వర్క్‌ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఆయన మంచి వ్యక్తి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన గురించి ఎన్నో విషయాలు చెబుతా. నా నిర్మాతలు నన్నొక కుటుంబసభ్యురాలిగా చూసుకున్నారు. సినిమా విషయంలో ఒత్తిడికి గురి చేయలేదు’’ అని ఆమె చెప్పారు.

అకీరా తెరంగేట్రంపై మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కోర్సులతోపాటు స్క్రిప్ట్‌ రైటింగ్‌పై ప్రస్తుతానికి అకీరా ఫోకస్‌ చేస్తున్నాడు. నటనవైపు అడుగువేయాలని అతడు అనుకోవడం లేదు. అలాగే నేను కానీ, పవన్‌కల్యాణ్‌ కానీ యాక్టర్‌గా మారమని అకీరాను బలవంతం చేయడం లేదు. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. నేను ఒక నటిని. వాళ్ల నాన్న, పెదనాన్న యాక్టర్స్. నా తనయుడిని వెండితెరపై చూడాలని నాకు ఆశగా ఉంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి.’’ అని ఆమె తెలిపారు.   

Sitara: సినిమా.. నా డీఎన్‌ఏలోనే ఉంది: సితార

రచయిత, సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె.. హేమలతా లవణం. ఆమె తన భర్త గోపరాజు లవణంతో కలిసి అంటరానితనం - కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. జోగిని దురాచార నిర్మూలన - నేరస్థుల సంస్కరణల కోసం అవిరళ కృషి చేశారు. బందిపోట్ల సంస్కరణ కోసం మధ్యప్రదేశ్‌ అడవుల్లో పాదయాత్ర చేశారు. ఎంతో మంది దొంగలు తమ వృత్తిని వీడి సామాన్య జీవనం గడపడానికి హేమలత కృషి చేశారు.

టైగర్‌ నాగేశ్వరరావు గురించి ఎన్నో కథలు విని.. వాటిని ప్రేక్షకులకూ తెలియజేయాలనే ఉద్దేశంతో వంశీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ దీనిని నిర్మిస్తున్నారు. నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలు. అక్టోబర్‌ 20న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బధిరుల భాషలోనూ విడుదల కానున్న తొలి తెలుగు చిత్రమిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని