MaheshBabu: ‘పోకిరి’ రోజులు గుర్తుకొచ్చాయి

‘‘రెండేళ్లలో చాలా జరిగాయి, చాలా మారాయి.  నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. ఏది   జరిగినా ఏది మారినా ప్రేక్షకుల అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా...

Updated : 08 May 2022 16:05 IST

‘‘రెండేళ్లలో చాలా జరిగాయి, చాలా మారాయి.  నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. ఏది   జరిగినా ఏది మారినా ప్రేక్షకుల అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా... పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ చిత్రంలో  మహేష్‌బాబు సరసన     కీర్తిసురేష్‌ నటించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌  ఆచంట, గోపీ ఆచంట   నిర్మాతలు. తమన్‌ స్వరకర్త.   వేడుకని ఉద్దేశించి మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘రెండేళ్లయింది ఇలాంటి వేడుక చేసుకుని. అభిమానుల్ని చూస్తుంటే ఆనందం కలుగుతోంది.    దర్శకుడు పరశురామ్‌ నా పాత్రని చాలా బాగా డిజైన్‌ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తుకొచ్చాయి. హీరో హీరోయిన్‌ ట్రాక్‌ కోసమే మళ్లీమళ్లీ థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులు ఉంటారు. కీర్తి నటన ఆశ్చర్య పరుస్తుంది. తమన్‌ పాటలు, నేపథ్య సంగీతం ఇరగదీశాడు. రామ్‌ లక్ష్మణ్‌, ఛాయాగ్రాహకుడు మధి, నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌, కళా దర్శకుడు ప్రకాశ్‌, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌, గీత రచయిత అనంతశ్రీరామ్‌, దర్శకత్వ బృందం... అలా అందరూ అత్యుత్తమ పనితీరుని  కనబరిచార’’న్నారు.

* ఈ వేడుకకి అతిథిగా హాజరైన దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఎప్పట్నుంచో చూడాలనుకుంటున్న మహేష్‌బాబుని ఇందులో చూస్తున్నాం. ట్రైలర్‌ చూసినప్పట్నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూస్తున్నా. ‘గీత గోవిందం’ చూస్తే సన్నివేశాల్ని సున్నితంగా చెప్పే పరశురామ్‌ కళ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాంటి దర్శకుడు ఓ మాస్‌ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తాం’’ అన్నారు.

* ‘‘నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. ఆస్వాదిస్తూ పనిచేశా. ఇందులో పాటలన్నీ చాలా  బాగా వచ్చాయి’’ అన్నారు తమన్‌.

* అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబుతో పనిచేయడం ఓ కిక్‌. ‘సరిలేరు    నీకెవ్వరు’ రికార్డ్స్‌ అన్నిటినీ ఒక  వారంలోనే ఇది అధిగమించాలని  కోరుకుంటున్నా’’ అన్నారు.

* ‘‘యువ దర్శకులంతా మహేష్‌తో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

* దర్శకుడు బుచ్చిబాబు సానా  మాట్లాడుతూ ‘‘కొన్నిసినిమాలు హిట్‌ అయిపోతాయని ముందే తెలిసిపోతుంటాయి. ఈ సినిమాకి అలా  తెలిసిపోయింది’’ అన్నారు.

* మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ‘‘మహేష్‌ని అత్యుత్తమంగా ప్రజెంట్‌ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన దగ్గర పనిచేసిన పరశురామ్‌. మహేష్‌ని ఎలా చూపించాలో అలాగే చూపించార’’న్నారు.

* దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘పరశురామ్‌ రచయితగా ఉన్నప్పట్నుంచి తెలుసు. ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌తోనే బ్లాక్‌బస్టర్‌ కళ తీసుకొచ్చారు. మే 12వ తేదీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.

* కథానాయకుడు సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘ఏ పాత్ర అయినా చేయగల సూపర్‌స్టార్‌ మహేష్‌. తన సినిమా విడుదలైతే క్లాస్‌ మాస్‌, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్‌కొస్తారు. ఈ    సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా మా అబ్బాయి  దర్శన్‌ కనిపిస్తార’’న్నారు.

ఈ కార్యక్రమంలో జి.ఆదిశేషగిరిరావు, సముద్రఖని, అనంతశ్రీరామ్‌, అశోక్‌ గల్లా, కిలారి సతీష్‌, రామ్‌లక్ష్మణ్‌, ఏఎస్‌ ప్రకాశ్‌, డా.రామారావు తదితరులు పాల్గొన్నారు.


* పరశురామ్‌ మాట్లాడుతూ ‘‘కథ రాసి మహేష్‌ని కలవాలనుకున్న ప్రయత్నంలో ఉండగా నాకు కొరటాల శివ సాయం చేశారు. కథ చెప్పడం మొదలు పెట్టాక ఐదు నిమిషాలకి ఆయన నవ్వడం మొదలైంది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందీ చిత్రం’’ అన్నారు.


* కీర్తిసురేష్‌ మాట్లాడుతూ ‘‘కళావతి పాత్రని నాకు బహుమతిగా ఇచ్చారు పరశురామ్‌. మహేష్‌తో చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆయన టైమింగ్‌ని ఎలా మ్యాచ్‌ చేయాలనే ఉత్కంఠ ఉంటుంది. డబ్బింగ్‌లో సినిమా చూస్తున్నప్పుడు తన గ్లామర్‌ని మ్యాచ్‌ చేస్తానా అనే భయం ఉంటుంద’’న్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని