Vijay: ‘నేను ముఖ్యమంత్రి అయితే..?’: దళపతి విజయ్ సమాధానం వైరల్‌

ప్రముఖ తమిళనటుడు విజయ్(Vijay) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో ఆయనకు సంబంధించిన ఓ విషయం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 

Published : 02 Feb 2024 17:58 IST

చెన్నై:  తన సినిమాలతో భారీ స్థాయిలో అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న దళపతి విజయ్‌(Vijay) శుక్రవారం కొత్త పార్టీని ప్రకటించారు. సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన.. రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. దానిని నిజం చేస్తూ ఆయన ఈ రోజు ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో తమిళ(Tamil Nadu) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే..?’ అని ఓ సందర్భంలో ఎదురైన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం తాజాగా వైరల్‌ అవుతోంది.

2018లో ఆయన ‘సర్కార్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. అందులో ఓటు రిగ్గింగ్ గురించి ప్రస్తావించారు. తన ప్రమేయం లేకుండా పోలైన ఓటును న్యాయపోరాటం ద్వారా సాధించుకునే ఓ ఎన్‌ఆర్‌ఐ పాత్రలో ఆయన కనిపించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశమూ వస్తుంది. ఆ చిత్రం ఆడియో లాంచ్‌లో భాగంగా.. నిజజీవితంలో విజయ్(Vijay) సీఎం అయితే ఏం జరుగుతుందని ఓ యాంకర్‌ ప్రశ్నించారు. ‘నేను ముఖ్యమంత్రిని అయితే.. ఎప్పటికీ నటించను’ అని స్పష్టంగా చెప్పారు. తాను చూసినంతవరకు చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించినవారే అని, ప్రజల కోసం పనిచేసిన వారు లేరని వివరించారు.

రాజకీయాల్లోకి విజయ్‌.. పార్టీ పేరు ప్రకటించిన దళపతి

ఇదిలా ఉండగా.. పార్టీ ప్రకటనకు ముందు విజయ్‌.. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో పలుమార్లు సమావేశమయ్యారు. పార్టీ పేరు, జెండా, అజెండాపై చర్చించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని తాజాగా దళపతి వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని