
విదేశీ వైద్య విద్యకు కరోనా దెబ్బ
మందకొడిగా ప్రవేశాలు
విదేశాలకు వెళ్లినా ఆన్లైన్లోనే తరగతులు
అమరావతి: కరోనా సృష్టించిన భయానక వాతావరణంతో విదేశాల్లో వైద్య విద్య చదవాలని అనుకుంటున్న వారిలో కొందరు తమ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు. ఇప్పటికే విదేశాల్లో చదువుతూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అర్ధంతరంగా స్వస్థలాలకు (స్వదేశానికి) వచ్చిన వైద్య విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే పరిమితమవుతున్నారు. మరోవైపు చైనాతోపాటు కరేబియన్ దేశాలు, రష్యా, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, కజికిస్థాన్, తజకిస్థాన్, జార్జియా, సెంట్రల్ అమెరికా వంటి దేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన వారిలో కొందరు కొవిడ్ కారణంగా స్వస్థలాలకు రాకుండానే అక్కడే ఉండిపోయినా వీరు కూడా ఆన్లైన్లోనే తరగతులకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. నీట్ ర్యాంకుతో సీటు రాకపోవడం.. తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేయవచ్చన్న ఉద్దేశంతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు ప్రతి ఏటా దేశం నుంచి 20వేల మందికిపైగా విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 3,500 నుంచి 4,000 మంది వరకు ఉంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ దఫా విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు ప్రవేశాలు పొందిన వారు గతంలో కంటే తగ్గినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది తరగతులు జరుగుతాయో లేదా అన్న ఆందోళన, ఆన్లైన్లో తరగతులకు హాజరైతే ఉపయోగం ఉంటుందా? లేదా? వీసాల రాకలో సమస్యలు, విదేశీ ప్రయాణానికి ఉన్న ఆంక్షలు కారణంగా కొందరు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు ఆసక్తి చూపలేదు.
అర్ధంతరంగా స్వస్థలాలకు తిరిగొచ్చి...!
కరోనా కారణంగా గత ఏడాది విద్యా సంవత్సరం మధ్యలోనే విద్యార్థులు తమ స్వస్థలాలకు విదేశాల నుంచి తిరిగొచ్చారు. వీరంతా ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఆయా విశ్వవిద్యాలయాలు నిర్వహించే తరగతులకు హాజరవుతున్నారు. ఎంబీబీఎస్ చివరి 2 సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ కీలకం. సుమారు 80% ప్రాక్టికల్ పద్ధతిలోనే తరగతులు జరుగుతాయి. వీరంతా ప్రస్తుతం ‘డిజిటల్’ విధానంలో ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్వహించే ‘ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష’లో నెగ్గుకురాగలమా? అన్న సందేహాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
విదేశాలకు వెళ్లినా ఆన్లైన్లోనే తరగతులు!
జార్జియా, తజకిస్థాన్, ఉక్రెయిన్ వంటి దేశాలు విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అయితే.. వీరికి కూడా అక్కడ ఆన్లైన్లోనే తరగతులు జరుగుతున్నాయి. తరగతులకు విద్యార్థులకు నేరుగా హాజరయ్యారా? లేదా? అన్న దానిపై సమస్యల్లేకుండా ఉండేందుకు వెళ్లారు.
సమ్మతి లేఖ అడుగుతున్నారు
ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నా... క్లినిక్‌లో ప్రాక్టికల్స్‌తో చదవాలంటే తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖ అడిగారు. కరోనా వైరస్ కారణంగా ఏమైనా సమస్యలు వస్తే మీదే బాధ్యత అని లేఖలో పేర్కొంటున్నారు. క్లినికల్‌గా తరగతులు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయాలు సిద్ధంగా లేవు. దీనివల్ల ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా. భారతదేశంలో ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. అయితే ఇంటర్న్‌షిప్ కాలాన్ని ఏడాది కాకుండా ఇంకా పెంచుతారేమో అన్న ఆందోళన ఉంది.- విజయలక్ష్మి, ప్రకాశం జిల్లా
సెప్టెంబరులో రావాలని సంకేతాలు
చైనాలో చదువుతూ కిందటేడాది ఆరంభంలోనే భారతదేశానికి తిరిగి వచ్చాను. మూడో సంవత్సరం చదువుతున్నా. ఆన్లైన్లోనే తరగతులకు హాజరవుతున్నా. సెప్టెంబరు నుంచి తరగతులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం వచ్చింది. వెళ్లేంతవరకూ ఒత్తిడి తప్పదు.- సుభాష్, కరీంనగర్
ఇవీ చదవండి..
ట్రంప్‌పై 9/11 తరహా కమిషన్!