Published : 13/01/2021 15:51 IST

కొత్త హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్రక్రియ: వారికి నష్టమే

వాషింగ్టన్: భారతీయుల సహా, ఇతర దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు అమెరికాలో పని చేయాలంటే తప్పనిసరిగా హెచ్‌-1బీ వీసా అవసరం. గత కొంతకాలంగా ఈ వీసా ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చేసుకుంటూ వచ్చారు. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేశారు. తాజాగా హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో కీలక సవరణ చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానం కాకుండా, అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్) అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిబంధనల సవరణకు తాజాగా హోంల్యాండ్‌ సెక్యురిటీ తుది ప్రకటన చేసింది. దీంతో ఏడాదికి సరిపడా జారీ చేసే 85వేల హెచ్‌-1బీ వీసాలను వేతనాలు, నైపుణ్యాల ఆధారంగా జారీ చేయనున్నారు.

విద్యార్థులపై ప్రభావం

కొత్త విధానం వల్ల అందరికీ లాభదాయకమేనని అమెరికా చెబుతున్నా, విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభగల విద్యార్థులు హెచ్‌-1బీ వీసా పొజిషన్స్‌లో లెవల్‌-1కు అర్హులవుతారు. వీరంతా శిక్షణా కాలంలో ఉంటారని, వారిని అత్యధిక వేతనం పొందుతున్న వారిగా పరిగణిస్తామని యూఎస్‌సీఐఎస్‌ చెబుతోంది. అయితే, కేవలం STEM విద్యార్థులు మాత్రమే మూడేళ్ల ఆప్ట్‌(OPT) కాలానికి అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ, ఏడాది OPT కాలానికి అర్హత సాధించే విదేశీ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని కోల్పోతారు.

అంతేకాదు, అనుభవంతో పాటు మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న కొందరు విద్యార్థులు లెవల్‌-2 పొజిషన్స్‌కు అర్హులైన వారూ అర్హత సాధించలేకపోవచ్చు. అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే వారిపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయని విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పట్టభద్రులైన తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు సన్నగిల్లుతాయి. కాగా, మరోవైపు యూకే, కెనడాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అక్కడ పనిచేసేందుకు అనుకూలంగా అవకాశాలు కల్పిస్తుండటం విశేషం. తాజా నిబంధనల ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు మొదటిగా యూఎస్‌సీఐఎస్‌ వీసాలు మంజూరు చేస్తుంది. అదే సమయంలో వారి స్థాయిని బట్టి, అత్యధిక నైపుణ్యం ఉన్న వారినీ పరిగణనలోకి తీసుకుంటుంది. వీరంతా లెవల్‌-4 పొజిషన్‌లో ఉంటారు. అక్కడి నుంచి దశల వారీగా లెవల్‌-1 వరకూ వీసాలు మంజూరు చేస్తుంది. తాజా నిబంధనలు మార్చి 9, 2021 వరకూ అమల్లో ఉంటాయి.

ప్రస్తుతమున్న తాత్కాలిక వీసా విధానాన్ని ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లో నియమించేందుకు ఉపయోగించటం ద్వారా యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారని.. దీనిని అరికట్టేందుకే ఈ సవరణలు చేపట్టామని యూఎస్‌సీఐఎస్ డిప్యూటీ డైరక్టర్‌ ఫర్‌ పాలసీస్‌ జోసెఫ్‌ ఎడ్‌లో వివరించారు. కాగా, భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన లక్షలాది నిపుణులకు అమెరికా కొలువులను అందించే హెచ్‌-1బి వీసా నమోదు కార్యక్రమం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1న ప్రారంభం కావాల్సి ఉంది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని