జగన్‌ అండతోనే రెచ్చిపోతున్నారు: చంద్రబాబు

ఓం ప్రతాప్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు  గృహ నిర్బంధం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ...

Published : 30 Aug 2020 01:53 IST

అమరావతి: ఓం ప్రతాప్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు  గృహ నిర్బంధం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పార్టీ దళిత నాయకులతో శనివారం ఆయన  టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

‘‘తెదేపా కోరడం వల్లే ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష చేశారు. హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు. రహస్యంగా శవపరీక్ష జరపడం మరో తప్పు. మృతుడి చరవాణిని పోలీసులే తీసుకోవడం మరో తప్పు. కేసు లేకపోతే ఓం ప్రతాప్‌ చరవాణిని ఎందుకు తీసుకెళ్లారు? మృతుడు ఓం ప్రతాప్‌ ఫోన్‌కాల్‌ జాబితా బయటపెట్టాలి. బెదిరింపులు, ప్రలోభాలతో జరిగిన నేరం దాయలేరు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.  

చిత్తూరులో దళితులపై దాడులకు పెద్దిరెడ్డే కారణమని ఆరోపించారు. శిరోముండనాల ఘటనలు మానవత్వానికి సిగ్గు చేటన్న చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా ఘటనలో నిందితుడిని అరెస్టు చేస్తే ఇప్పుడు విశాఖలో జరిగేదా అని ప్రశ్నించారు. వరుస శిరోముండనాలకు  సీఎం జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ అండతోనే  జిల్లాల్లో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తమ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని