‘కరోనా పోయింది.. అందుకే లాక్‌డౌన్‌’

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పశ్చిమ బెంగాల్ భాజపా అధ్యక్షుడు..

Published : 12 Sep 2020 01:36 IST

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు

కోల్‌కతా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పశ్చిమ బెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. కరోనా వైరస్‌ ఎప్పుడో వెళ్లిపోయిందని, కేవలం భాజపా ర్యాలీలను అడ్డుకునేందుకే మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నారంటూ పేర్కొన్నారు. భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు వేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు (టీఎంసీ), పోలీసులపై ప్రతీకారానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హూగ్లీ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

‘భాజపా సభలకు హాజరయ్యే జనాన్ని చూసి మమతా బెనర్జీ అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్రంలో కరోనా పోయింది. భాజపాకి భయపడి బెంగాల్‌లో పార్టీ ర్యాలీలను ఆపేందుకే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది. కరోనా పేరుతో మమతా బెనర్జీ నాటకాలు ఆడుతున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు మోపిన టీఎంసీ కార్యకర్తలు, పోలీసులపై ప్రతీకారానికి ఇనుప రాడ్లతో సిద్ధంగా ఉండాలి. ఎవరెవరు మీపై తప్పుడు కేసులు పెట్టారో వారందరిపై దృష్టి సారించండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

దిలీప్‌ ఘోష్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ కార్యకర్తలను బూట్లతో కొట్టాలన్నారు. గతేడాది ఓ పోలీసు అధికారిని తీవ్రస్థాయిలో బెదిరించారు. ‘మా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే నీ శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా చేస్తా. దహన సంస్కారాలు నిర్వహించేందుకు నీ శవాన్ని కూడా దొరకకుండా చేస్తా’ అన్నారు. అంతకముందు కార్యకర్తలతో మాట్లాడుతూ అధికార పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మీరే పోలీసులను దండించండి అంటూ వారికి సెలవిచ్చారు. జనవరిలో జరిగిన మరో సభలో ఇంట్లో కూర్చుంటే మంచి రాజకీయ నేతలు కాలేరని, ఉత్తమ రాజకీయ నాయకులు కావాలంటూ జైలుకెళ్లాల్సిందేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

బెంగాల్‌లో గురువారం 3వేల కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,93,175 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో ఘోష్‌ కరోనా పోయిందంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని