గోవా, ఉత్తరాఖండ్‌కు మళ్లీ వారే.. ప్రమోద్‌ సావంత్‌, పుష్కర్‌ సింగ్‌ ధామీకి మరో ఛాన్స్‌

ఉత్తరాఖండ్‌ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. తదుపరి ముఖ్యమంత్రిగా మళ్లీ పుష్కర్‌ సింగ్‌ ధామీకే వరుసగా రెండోసారి భాజపా అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన ......

Published : 21 Mar 2022 19:42 IST

దేహ్రాదూన్‌/పనాజీ: గోవా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రుల విషయంలో సస్పెన్స్‌ వీడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మొన్నటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రమోద్‌ సావంత్‌, పుష్కర్‌ సింగ్‌ ధామీవైపే భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. దీంతో వరుసగా రెండోసారి వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కొలువుదీరడమే తరువాయి.

సావంత్‌ ఏకగ్రీవంగా..

ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ భాజపా 20 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ, ముగ్గురు స్వతంత్రులు భాజపాకు మద్దతు తెలపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే, ముఖ్యమంత్రి పీఠం ఎవరికి అప్పగించాలన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రమోద్‌ సావంత్‌తో పాటు, విశ్వజిత్‌ రాణే పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గోవా ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, దేవేంద్ర ఫడణవీస్‌ సోమవారం గోవా చేరుకున్నారు. ప్రమోద్‌ సావంత్‌ను శాసనసభా పక్షం ఏకగ్రీవంగా తమ నాయకుడిని ఎన్నుకున్నట్లు తోమర్‌ వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల పాటు శాసనసభా పక్ష నాయకుడిగా సావంత్‌ వ్యవహరించనున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఓడినా ధామీ వైపే మొగ్గు..

ఇటీవల ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గాను 47 చోట్ల భాజపా విజయ దుందుభి మోగించింది. తన సొంత స్థానం ఖటిమాలో ధామీ ఓటమి పాలయ్యారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే అంశంపై గత పది రోజులుగా ఉత్కంఠ కొనసాగింది. సీఎం రేసులో పుష్కర్‌సింగ్‌ ధామీ ముందు వరుసలో ఉండగా.. మాజీ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌, మాజీ కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌, సీనియర్‌ నేత సత్పాల్‌ మహారాజ్‌ వంటి వారి పేర్లు కూడా వినబడ్డాయి. అయితే, ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ భాజపాను విజయతీరాలకు చేర్చడంలో 46 ఏళ్ల వయసు కలిగిన ఈ యువనేత చేసిన కృషిని గుర్తించి భాజపా ఆయనకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించినట్టు సమాచారం. భాజపా కేంద్ర పరిశీలకులుగా ఉన్న రాజ్‌నాథ్‌ సింగ్‌, మీనాక్షి లేఖి ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. పార్టీ నేతలతో సంప్రదింపుల అనంతరం పుష్కర్‌సింగ్ ధామీని ఉత్తరాఖండ్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్టు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ధామి సారథ్యంలో ఉత్తరాఖండ్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత పుష్కర్‌ సింగ్‌ ధామీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) గుర్మీత్‌ సింగ్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని