జీహెచ్‌ఎంసీలో మోగిన ఎన్నికల నగారా

జీహెచ్‌ఎంసీలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాకు వివరాలు వెల్లడించారు.

Updated : 20 Nov 2020 16:04 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాకు వివరాలు వెల్లడించారు. 2021 ఫిబ్రవరితో జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుందని పార్థసారధి తెలిపారు. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఓటర్ల జాబితాపై తుదినిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పోలీసు బందోబస్తు విషయంపై డీజీపీ, సీపీలతో ఇప్పటికే చర్చించామన్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతోనే బ్యాలెట్‌ పద్ధతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు.

‘‘పోలింగ్‌కు 55వేల మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాం. బ్యాలెట్‌ పేపర్‌ తెలుపు రంగులో ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు రూ.5 లక్షలు. ఫలితాలు వచ్చాక 45 రోజుల్లో ఎన్నికల ఖర్చులు చూపాలి. గ్రేటర్‌లో 257 క్రిటికల్‌, 1,004 అత్యంత సమస్యాత్మక, 1439 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2009లో 42.04 శాతం‌, 2016లో 45.29శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఎక్కువ పోలింగ్‌ నమోదయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఎన్నికల్లో ఖర్చులు చూపని అభ్యర్థులను 3 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తాం. ఎన్నికల్లో పోటీ చేసే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500, ఇతర అభ్యర్థులు రూ.5000ల చొప్పున డిపాజిట్‌ చెల్లించాలి. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు వేయొచ్చు’’ అని ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు.

 

రిజర్వేషన్ల వివరాలు... జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి మహిళ (జనరల్‌), ఎస్టీ 2 (జనరల్‌ 1, మహిళ 1), ఎస్సీ 10 (జనరల్‌ 5, మహిళలు 5), బీసీ 50 జనరల్‌ 25, మహిళలు 25), జనరల్‌ మహిళ 44, జనరల్‌ 44

ఎన్నికల షెడ్యూల్‌

* రేపటి నుంచి ఈనెల 20వరకు నామినేషన్ల స్వీకరణ

*  21న నామినేషన్ల పరిశీలన

* 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం

* డిసెంబరు 1న బల్దియా పోలింగ్‌

* డిసెంబరు 3న అవసరమైన కేంద్రాల్లో రీ పోలింగ్‌

* డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని