‘కేంద్రం వాటాపై హరీశ్‌ చెప్పేవి అబద్ధాలే’

తెలంగాణ భవిష్యత్‌కు దుబ్బాక ఉప ఎన్నిక నాంది పలుకుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 31 Oct 2020 01:16 IST

మేం లేకుంటే వెయ్యిమంది కేసీఆర్‌లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

దుబ్బాక: తెలంగాణ భవిష్యత్‌కు దుబ్బాక ఉప ఎన్నిక నాంది పలుకుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస, కేసీఆర్‌కు బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా భూంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిర్వహించిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపించారు.

‘‘తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటాపై మంత్రి హరీశ్‌రావు చెప్పేవి అబద్ధాలే. పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ప్రస్తుతం రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందో ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్‌ చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా దళితులకు మొండిచేయి చూపారు. మూత పడిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించలేకపోయారు? రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. ఏడు సంవత్సరాలుగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. భాజపా లేకపోతే వెయ్యి మంది కేసీఆర్‌లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ మెడలు వంచడంతో తెలంగాణ సాధించుకున్నాం’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. 

పోరాడే తెగింపు రఘునందన్‌ది..గెలిపించండి

ప్రశ్నించే గొంతు రఘునందన్‌రావుదని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న వ్యక్తి ఆయనని కిషన్‌రెడ్డి చెప్పారు. రఘునందన్‌కు డబ్బులేకపోయినా ప్రజల కోసం పోరాడే తెగింపు ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాటం చేయగల ఆయన్ను ఉప ఎన్నికలో గెలిపించాలని కిషన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని