AAP: గుజరాత్‌పై ‘ఆప్‌’ గురి.. ఇప్పుడైతే 58 సీట్లొస్తాయంటూ ప్రకటన!

దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో కొనసాగుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్‌పై గురిపెట్టింది. శని, ఆదివారాల్లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌,....

Published : 05 Apr 2022 02:11 IST

అహ్మదాబాద్‌: దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో కొనసాగుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్‌పై గురిపెట్టింది. శని, ఆదివారాల్లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ అక్కడ పర్యటించిన అనంతరం సోమవారం గుజరాత్‌లోని ఆ పార్టీ ఇన్‌ఛార్జి, వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు డా.సందీప్‌ పాఠక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటి పరిస్థితుల్లో అయితే తమ పార్టీ దాదాపు 58 స్థానాలు గెలుచుకుంటుందని అంతర్గత సర్వేలో తేలినట్టు చెప్పారు. తమ పార్టీకి చెందిన ఏజెన్సీ ఒకటి  శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసినట్టు పేర్కొన్నారు. అంతర్గత సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న గ్రామీణ ఓటర్లు, పట్టణ ప్రాంతాల్లో మార్పు కోరుకుంటున్న మధ్యతరగతి ఓటర్లు ఆప్‌ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిపారు.

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆప్‌ 58 సీట్లు గెలుచుకుంటుందని పాఠక్‌ అన్నారు. భాజపాను కాంగ్రెస్‌ పార్టీ ఓడించలేదనే భావన గ్రామీణ ప్రజల్లో ఉందన్నారు. ఇప్పటికైతే ఇదే పరిస్థితి ఉందనీ.. కాలం గడిచిన కొద్దీ ఈ సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. భాజపా ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్‌ విభాగం ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఆప్‌కు 55 సీట్లు వస్తాయని తేలినట్టు పాఠక్‌ వ్యాఖ్యానించారు. సందీప్‌ పాఠక్‌ ఇటీవల పంజాబ్‌లో ఆప్‌ అపూర్వ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. 182 స్థానాలు కలిగిన గుజరాత్‌ అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని