Gujarat polls: ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ పోటీ ఇక్కడి నుంచే..!

వచ్చే నెలలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat polls) ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ(Isudan Gadhvi) పోటీ చేయబోయే స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Published : 14 Nov 2022 01:11 IST

అహ్మదాబాద్: వచ్చే నెలలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat polls) ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ(Isudan Gadhvi) పోటీ చేయబోయే స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. గఢ్వీ సొంత జిల్లా దేవ్‌భూమి ద్వారకాలోని ఖంభాలియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఇసుదాన్‌ గఢ్వీ కొన్నేళ్లుగా రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, వ్యాపారుల తరఫున గళం వినిపిస్తున్నారని తెలిపారు. శ్రీకృష్ణుడి పవిత్రస్థలం నుంచి గుజరాత్‌కు కొత్త, మంచి ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ గఢ్వీ ట్వీట్‌ చేశారు. ‘‘మీరు, గుజరాత్‌ ప్రజలు నాపట్ల ఉంచిన విశ్వాసం మేరకు నా తుదిశ్వాస వరకు గుజరాత్‌ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నా. జై జై గర్వి గుజరాత్‌’’ అని పేర్కొన్నారు.

గుజరాత్‌ సీఎం అభ్యర్థి కోసం ఆప్‌ పంజాబ్‌ తరహాలోనే ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన  పోల్‌లో 16 లక్షలపైగా ఓటర్లు పాల్గొన్నారు. ఇందులో దాదాపు 73% మంది గఢ్వీ వైపు మొగ్గు చూపారని ఇటీవల కేజ్రీవాల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. సీఎం అభ్యర్థి రేసులో ఇసుదాన్‌తో పాటు.. పాటీదార్‌ సామాజిక వర్గానికి చెందిన ఆప్‌ గుజరాత్‌ పార్టీ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా ఉండగా.. వెనుకబడిన తరగతి వర్గానికి చెందిన గఢ్వీనే విజయం వరించింది.  40 ఏళ్ల గఢ్వీ.. ద్వారకా జిల్లాలోని పిపలియా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు స్థానిక టీవీ ఛానల్‌లో పాత్రికేయుడిగా కెరీర్‌ ప్రారంభించారు. ‘ఈటీవీ గుజరాతీ’ ఛానల్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వహించారు. తర్వాత వీ ఛానల్‌కు సంపాదకుడు అయ్యారు. అక్కడ గ్రామీణ, రైతు సమస్యలపై ‘మహామంథన్‌’ పేరుతో నిర్వహించిన షో... గఢ్వీకి పేరు తెచ్చింది.

గుజరాత్‌లో మొత్తం 182 సీట్లకు రెండు విడతల్లో (డిసెంబర్‌ 1, 5తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.  అయితే, ఆప్‌ ఇప్పటివరకు 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో ఖంభాలియా సహా 88 ఇతర సీట్లకు పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికలకు నామినేషన్‌ గడువు సోమవారంతో ముగియనున్న వేళ కేజ్రీవాల్‌ గఢ్వీ పేరును ఈరోజు సాయంత్రం ప్రకటించారు.  గుజరాత్‌లో రెండో విడత పోలింగ్‌ డిసెంబర్ 5న జరగనుండగా.. అదేనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని